Jump to content

పుట:భీమేశ్వరపురాణము.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48 శ్రీ భీమేశ్వరపురాణము

తే. జంభరిపుదిక్కునకు సీమ సలిలరాశి, పశ్చిమమునకు సీమ త్ర్యంబకతనూజ
ద్యుమ్నపతిదిక్కునకు సీమ తుల్యభాగ, దక్షిణమునకు వృద్ధగౌతమియె సీమ. 33

తే. భోగమోక్షమహైశ్వర్యయోగకాంక్ష, భీమమండలిఁ గాపుండఁ బ్రియమువుట్ట
మర్త్యయోని జనింపంగ మదిఁ దలంత్రు, వివిధగంధర్వకిన్నరవిబుధవరులు. 34

తే. భీమమండలికాపుణ్యభూమియందుఁ, దేజరిల్లెడు పండ్రెండుక్షేత్రములకు
జాతరలు సేయు నప్సరస్సతులతోడ, నాకముననుండి యేతెంచి నముచివైరి. 35

సీ. ఏడురసాతలక్రోడంబులును విని, ర్భేదించి వెడలిన పెద్దవేల్పు
మార్తాండుచే నభోమణిచేత రవిచేఁ బ్ర, తిష్ఠఁ బొందిన మహాదివ్యమూర్తి
సప్తర్షు లరుదేర సప్తగోదావరం, బవగాహనము చేసినట్టిప్రోడ
తొలుమామ యగుదక్షు, నెలదోఁటనడుచక్కి,విహరణం బొనరించువేడ్కకాఁడు
తే. విశ్వపతి భీమనాథేశ్వరేశ్వరుండు, కర్తయై యుండి భోగమోక్షముల నిచ్చు
భక్తజనులకు నట్టి వైభవపదంబు, మండనము మేదినికి భీమమండలంబు. 36

సీ, ఎచ్చోటఁ దాఁ బాఱె నిఱ్ఱిరూపముఁ దాల్చి, యతిసాధ్వసంబుతో నధ్వరంబు
పాటిల్లె నెచ్చోట భాషావధూటికి, నతిజుగుప్సితమైన యంగవికృతి
యెచ్చోట ముచ్చిచ్చు నేడేసినాల్కలు, కొండనాల్కల దాఁకఁ గోఁతవడియె
నెచ్చోట నులివేఁడి యెండఁ బండులు రాలి, పూషార్కువదనంబు బోసివడియె
తే. దక్షుఁ డెచ్చోటఁ బొట్టేలితల ధరించెఁ, జిందువందయ్యె నెచ్చోట నిందుఁ డనుచుఁ
జెప్పుదురు వీరభద్రుని జృంభణంబు, భీమమండలి నుండు ప్రాఁబెద్దమునులు. 37

వ. నీవు విశ్వేశ్వరదేవవిరచితావమానమనశ్శల్యంబున డస్సి ఖిన్నుండవై యున్నవాఁడవు; నిన్ను విడిచిపోవుట నాకు నుచితంబు గాదు; నీవు నేనునుంగూడి ద్వాదశపుణ్యక్షేత్రయాత్రాప్రసంగమునఁ గుక్కుటేశ్వరదేవు దర్శింపఁగలవార మీవేళ దక్షారామంబునకు మగిడి పోదము లెమ్మని యతండును దానును లోపాముద్రయును శిక్ష్యమండలంబునుం గదలి యిష్టాలాపంబులం బ్రొద్దుపుచ్చుచుం జనిచని. 38

సీ. తుల్యభాగాతటీద్రుమమండలం బైన, సాంపరాయపురంబు సరణిఁ బట్టి
చూతాటవీవాటి శోభమానం బైన, పులుగుర్తిసోమేశు వలపలించి
యోంకారపురిఁ ద్రికూటోపరిస్థితులైన, హరిహరబ్రహ్మల నభినుతించి
శీలామహాగ్రామసింహాసనస్థున[1], కురగహారున కెదురుండి మ్రొక్కి
తే.యరుగువారు మునుల్ పరాశరసుతునకు
దక్షవాటిఁ బ్రవేశింపఁదగినయట్టి

  1. అశ్లీలము ప్రమాదపతితము. ప్రమదోధీమతామపి.