పుట:భీమేశ్వరపురాణము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4 శ్రీ భీమేశ్వరపురాణము

యేమంత్రి సితకీర్తి యేసువారాసుల, కడకొండ యవులచీఁకటికి గొంగ
యేమం శ్రీ సౌభాగ్య మిగురుఁగైదునజోదు, లాలిత్యలీలకు మేలుబంతి
తే. యతఁడు కర్ణాట లాట బోటాంగ వంగ, కురు కుకురు కుంతలావంతి ఘూర్జరాది
నృపసభాస్థానబుధవర్ణనీయసుగుణ, మండనుఁడు బెండపూఁడన్న మంత్రివరుఁడు. 19

వ. ఒక్కనాఁడు. 20

సీ. భాట్టప్రభాకరప్రస్థానసంవేద్యు, లుద్దండపండితు లొక్కవంక
ఫణిపభాషితభాష్యఫక్కికాభావజ్ఞు, లుత్తమప్రాగల్భ్యు లొక్కవంకఁ
గణభుఙ్మతగ్రంథగాఢార్థవిదులు [1]బా, హుశ్రుత్యసంపన్ను లొక్కవంక
వేదాంతవాసనావిశ్రాంతహృదయజ్ఞు, లుపనిషత్తత్త్వజ్ఞు లొక్క నంక
తే. నుభయభాషాకవీశ్వరు లొక్కవంక, వేశ్య లకవంక నొకవంక వీరభటులు
బలసి కొలువంగఁ గొలువుండి పిలువఁబంపె, బండపూఁడన్నమంత్రీశ్వరుండు నన్ను. 21

గీ. ఇట్లు పిల్పించి సమ్మాన మెసక మెసఁగ, సముచితాసనమున నుంచి చతురలీల
నానతిచ్చెను రాయవేశ్యాభుజంగు, మంత్రి గంభీరధీరసంభాషణముల. 22

సీ. వినిపించినాఁడవు వేమభూపాలున, కఖలపురాణవిద్యాగమములు
కల్పించినాఁడవు గాఢపాకంబైన, హర్షనైషధకావ్య మాంధ్రభాష
భాషించినాఁడవు బహుదేశబుధులతో, విద్యాపరీక్షణవేళలందు
వెదచల్లినాఁడవు విశదకీర్తిస్ఫూర్తి, కర్పూరములు దిశాంగణములందుఁ
తే. బాకనాటింటివాఁడవు బాంధవుఁడవు, కమలనాభుని మనుమఁడ వమలమతివి
నాకుఁ గృప సేయు మొక ప్రబంధంబు నీవు, కలితగుణగణ్య శ్రీనాథకవివరేణ్య. 23

తే. సప్తసంతానములు నాకు సంభవించె, నొకప్రబంధంబు వెలితిగా సుకృతగరిమ
నావెలితి మాన నాపేర నంకితముగ, శివపురాణంబు తెనుఁగుగాఁ జేయు మొకటి. 24

వ. అదియును. 25

క. బంధుర సపాదలక్ష, గ్రంథంబై యైదుపదులు ఖండంబులతో
సంధిల్లును స్కాందం బన, సింధువునకుఁ గొల్వ లమరిచినచందమునన్. 26

మ. అరవిందాప్తకృతప్రతిష్ఠుఁడగు దక్షారామభీమేశ్వరే
శ్వరు మాహాత్మ్యముతోడఁ గూడి భువనశ్లాఘాస్పదంబై యభం
గురమై స్కాందపురాణసారమగు శ్రీగోదావరీఖండమున్
బరిపాటిన్ రచియింపు మంధ్రజగతీభాషాప్రబంధంబుగన్. 27

వ. అని పలికి సబహుమానంబుగాఁ గర్పూరతాంబూలజాంబూనదాంబరాభరణంబు లొసంగి వీడుకొలిపిన. 28

  1. బహుశ్రుతభావము బాహుశ్రుత్యము