పుట:భీమేశ్వరపురాణము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 5

సీ. ధారాసురత్రాణధాటీసమారంభ, గర్వపాథోరాశికలశజులకు
సప్తమాడియరాజఝాడియక్ష్మాపాల, వందితశ్రీపాదశివనరుహులకు
సింహాద్రిపర్యంతసీమాంధ్రమేదినీ, మండలీపాలనాఖండలులకు
హరిదంతదంతిదంతావళీలిఖ్యమా, నానేకజయశాసనాక్షరులకు
తే. వీరభద్రేశ వేమ పృథ్వీధవులకు ననుఁగుమంత్రి మహాప్రధానాగ్రగణ్యు
బెండపూఁడన్న జగనొబ్బగండబిరుద, సచివదేవేంద్రుఁ గృతి కధీశ్వరునిఁ జేసి. 29

వ. సర్గ ప్రతిసర్గ వంశ మన్వంతర వంశానుచరితంబు లనుపంచలక్షణంబులతోడం గూడి సపాదలక్షగ్రంథసంఖ్యాసమన్వితంబై పంచాశత్ఖండమండితంబై బహుసంహితాసమాకీర్ణంబై యొప్పు శ్రీమహాస్కాందంబను నాదిపురాణంబునందు గోదావరీఖండంబు శ్రీమద్దక్షారామభీమేశ్వరమాహాత్మ్యసంయుతంబగుటం జేసి భీమేశ్వరపురాణం బనంబరఁగు; నది యాంధ్రభాషాప్రబంధంబుగఁ జెప్పందొడంగితి; నమ్మహాప్రారంభంబునకు మంగళాలంకారంబుగా నమ్మహామంత్రీశ్వరునేలిన వీరభద్రేశ్వర వేమభూపాలుర వంశావతారం బభివర్ణించెద. 30

వేమభూపాలుని వంశావతారవర్జనము

ఉ. కైటభదైత్యవైరి పదకంజమునం దుదయంబు నొందె మీ
న్నేటికి భూతధాత్రికిని నెంతయు నచ్చిన తోడఁబుట్టువై
హాటకగర్భముఖ్యనిఖిలామరమౌళి మహామణిప్రభా
పాటలవర్ణమైన యొకపావనపర్ణ ముదీర్ణసంపదన్. 31

వ. అప్పుణ్యవంశంబు కంసాసురధ్వంసిచరణపల్లవంబు దనకుఁ బుట్టినిల్లుగావునఁ గారణ గుణసంక్రమంబునంబోలెఁ జామరతోమరచ్ఛత్రధనుఃఖడ్గాది చిహ్నోపశోభితంబై, చదలేటినీటివలని సోదరీయస్నేహలబ్ధంబులుంబోని పావనత్వ శుచిత్వ గాంభీర్య మాధుర్యంబులు చరితమనస్స్వభావవచనంబుల ధరియించి సైదోడుం బొదివి విశ్వవిశ్వంభరాక్రీడనంబు దనకు విదిర్చిన పరమక్షాంతి యంతరంగంబున సంతరించి నిఖిలప్రపంచంబునకు నాధారంబై ప్రవర్తిల్లె అందుఁ బద్మనాయకులన వెలమలనఁగమ్మలనసరిసర్లననంటర్లన బహుప్రకారశాఖోపశాఖాభిన్నంబులైన మార్గంబులం ద్రిమార్గగంగాప్రవాహంబులుంబోలె గోత్రంబు లెన్నియేనియు జగత్పవిత్రంబులై ప్రవహించుచుండఁ గల్పంబు లతిక్రమించి మన్వంతరంబులు జరిగి యుగంబులు సరికడచి వత్సరంబులు చని కాలచక్రంబు లతిక్రమించుచుండఁ జతుర్థకులమౌళిమండనంబై కీర్తివిహారఘంటాపథంబైన పంటమహాన్వయంబు బాకనాటిదేశంబున భద్రపీఠంబు నధివసించి సింహవిక్రమనగరదువ్వూరు గండవరాది పట్టనంబులు నిజనివాసంబులుగా భ్రూలతాదష్టాష్టాదశద్వీపాంతరాళులగు భూపాల