పుట:భీమేశ్వరపురాణము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 3

మ. [1]హరచూడాహరిణాంకవక్రతయుఁ గాలాంతస్ఫురచ్చండికా
పరుషోద్గాఢపయోధరస్ఫుటతటీపర్యంతకాఠిన్యమున్
సరసత్వంబును సంభవించె ననఁగా సత్కావ్యముల్ దిక్కులం
జిరణాలంబు నటించుచుండుఁ గవిరాజీగేహరంగంబులన్. 11

కుకవి నిరాకరణము

చ. వెస వసుధాస్థలంబునఁ గవీంద్రులు గొందఱు [2]శేముషీమషీ
రసము మనఃకటాహకుహరంబుల నించి కలంచి జిహ్వికా
కిసలయతూలికం గొని లిఖంతురు కబ్బము లెన్నఁగా మహా
న్యసనముతో నిజాననవియత్తల[3]తాళపలాశరేఖలన్. 12

తే. బోధమల్పంబు గర్వమభ్యున్నతంబు, శాంతి[4]నిప్పచ్చరంబు మచ్చరము ఘనము
కూపమండూకములుఁబోలెఁ గొంచె మెఱిఁగి, [5]పండితంమన్యులైన [6]వైతండికులకు. 13

తే. నికటమున నుండి శ్రుతిపుటనిష్ఠురముగ, నడరికాకులు బిట్టు పెద్దఱచినప్పు
డుడిగి రాయంచ యూరక యుంట లెస్స, సైఁపరాకున్న నెందేనిఁ జనుట యొప్పు. 14

తే. ప్రౌఢిఁ బరికింప సంస్కృతభాష యండ్రు, పలుకు[7]నుడికారమున నాంధ్రభాష యందు
రెవ్వ రేమన్న నండ్రుగాకేలకొఱఁత, నాకవిత్వంబు నిజము కర్ణాటభాష. 15

వ. అని యిష్టదేవతాప్రార్థనంబును బురాతనకవీంద్రగుణకీర్తనంబును గుకవినిరాకరణంబునుం జేసి యాత్మగతంబున. 16

తే. నవమరుత్తుచరిత్రంబు నైషధంబు,
సప్తశతి పండితారాధ్యచరిత మనఁగఁ
గావ్యములు పెక్కు చెప్పియుఁ గాంక్ష చనక
వెండియును గావ్య మొకటిఁ గావింపఁదలఁచి. 17

వ. ఉన్నంత. 18

ఉపోద్ఘాతము

సీ. ఏమంత్రి కులదైవ మిందుశేఖరుఁడు ద, క్షారామ భీమేశుఁ డఖిలకర్త
యేమంత్రి యేలిక యిక్ష్వాకుమాంధాతృ, రామసన్నిభుఁడైన వేమనృపతి

  1. హర…వక్రత = శివుని జటాజూటమందుండు చంద్రునివలె వక్రముగలట్టియును, అనఁగాఁ గేవల ప్రౌఢకవీశ్వరాంగీకృతమయి సామాన్యకవిజనానవబోధమగు రహస్యములని యర్థము
  2. మషీ = మసి (సిరా)
  3. తాళపలాశ = తాటియాకు
  4. నిప్పచ్చరము = లేమిడి
  5. పండితంమన్యులు = పండితులుగా కుండినను దాము పండితులనుని గర్వపడువారు
  6. వైతండికులు = వితండావాదము చేయువారు
  7. నుడికారము = మాటల చమత్కారము