పుట:భీమేశ్వరపురాణము.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

85


తే.

చటులతరకాలకూటాగ్ని సంజహర్ష, పాల్కడలి నట్టనడుమ సంప్రభవమైన
యమృతలింగంబవగునిన్ను నాశ్రయింతు, మభవ భీమేశ దక్షవాటాధినాథ.

110


క.

ప్రణవోత్తమాంగ ఫణిభూ, షణ గగనమణీందువహ్ని చక్షుస్త్రితయా
ఫణికటక జితమనోభవ, యణిమాదివిశేషదా పరాశ్రయచరణా.

111


ఉత్సాహము.

నీలకంఠ భక్తలోకనిధి భవాబ్ధితారణా
ఫాలభాగమత్కృపీట భవశిఖా హతస్మరా
శూలపాణి మమ్ముఁ గరుణఁ జూడు త్రిపురదానవుల్
జాలిఁ బెట్టుచున్నవా రసహ్యవిక్రమోద్ధతిన్.

112


సీ.

అర్కేందుహవ్యవాహనలోచనత్రయా, త్రిపురదైత్యులబాధ నపనయింపు
మంబికాహృదయంబు జాకరకలహంస, త్రిపురదైత్యులబాధ నపనయింపు
నిత్యనిర్మలశుద్ధ నిరవద్యనిర్ద్వంద్వ, త్రిపురదైత్యులబాధ నపనయింపు
దీప్తదీప్తాయుధస్థిరమహాదోర్దండ, త్రిపురదైత్యులబాధ నపనయింపు


తే.

డమరుపట్టసపరశుఖడ్గత్రిశూల, చాపఖట్వాంగధర నీవె శరణు మాకు
నన్యథా శరణంబు లే దభవ భీమ, యపనయింపుము త్రిపురాసురాదిబాధ.

113


క.

ముక్తవిశుద్ధనిరంజన, ముక్తప్రియ నిత్య యష్టమూర్తి ప్రతాపో
ద్విక్తత్రినగరపరివృఢ, నక్తంచరబాధమాన్పు నాగాభరణా.

114


క.

దగ్ధస్మరాంగశంకర, ముగ్ధేందుకళాకలాప మూర్ధాయన సు
స్నిగ్ధవిధాతృకపాల, స్రగ్ధారి ఘటింపు త్రిపురసంహారంబున్.

115


క.

అద్వయ సత్య క్షరాక్షర, సద్వంద్య యనాదినిధనసర్వేశ్వర కృ
ష్ణద్వైపాయనశుకముఖ, విశ్వన్నుత సంహరింపవే త్రిపురంబుల్.

116


క.

సర్వేశ్వర సర్వాత్మక, [1]శర్వ సదాశివ మహేశ శాశ్వతరుద్రా
సర్వజ్ఞ భీమనాయక, గర్వాంధుల నణఁపు త్రిపురకర్భురపతులన్.

117


సీ.

ప్రణతార్తిహర దేవ పరమేశధక్షవా, టాధీశయభవ మా కభయ మిమ్ము[2]
మంత్రోపనిషదర్థ మన్మథాంతకగంధ, సింధురాసురవైరి సేమ మిమ్ము
భక్తవత్సల శూలపాణి దక్షిణవార్ధి, వేలాతటీవాస విజయ మిమ్ము
సంసారమాయానుషంగశాశ్వతతమ, స్కంధమార్తాండ యైశ్వర్య మిమ్ము

  1. శర్వభవానీ శరణు జగదాధారా
    సర్వంబుఁ దామె యనుచును, గర్వించిరి యసురు లెల్ల గౌరీరమణా. పా.
  2. దానవసంఘమే తత్క్షణంబునం ద్రుంతు, ననుచును మా కిప్పు డభయ మిమ్ము
    మమ్ములఁ గృపఁజూడు మన్మథాంతకగంధ, సింధురాసురవైరి సేమ మిమ్ము. పా.