పుట:భీమేశ్వరపురాణము.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

శ్రీ భీమేశ్వరపురాణము


తే.

సద్యరక్షింపువామదేవాద్యప్రోవు,జయజ యాఘోరతత్పురుష జయ మొసఁగు
భద్ర మీశానశేయువు ప్రబలులైన, త్రిపురదైత్యులగర్వంబు ధిక్కరింపు.

118


శా.

త్రైలోక్యంబు భుజాప్రతాపమున నిర్వక్రమంబుగా నేలుచున్
హేలాహుంకృతిఁ గామగత్రినగరీహృద్యప్రచారంబులన్
వాలాయంబును మమ్ము వెట్టిగొనుచున్ వర్తించుచున్నారు మీ
రాలస్యం బొనరంచినన్ బ్రతుక శక్యం బెట్లు మాబోంట్లకున్.

119


క.

లోకంబులు త్రిపురాసురు, లేకచ్ఛత్రంబుగా నేలఁగ నున్నా
రో కాలకంఠ యింకిటు, మా కాపులుగావు ధర్మమార్గము దలఁగెన్.

120


మ.

అభయం బిందుకళాకిరీట శివదాయామ్నాయచూడామణీ
యిభరాట్చర్మపటీరకటీర యభవా యీశాన మొఱ్ఱో గిరి
ప్రభవామానసపద్మ పద్మహిత యబ్రహణ్య మాలింపు మా
కభిమానచ్యుతి పాటిలెం ద్రిపురదైత్యగ్రామణీశ్రేణిచేన్.

121


క.

కరుణింపు దక్షవాటీ, పురనాయక భీమలింగ భోగికులేంద్రా
భరణవిషదహనభయమును, బురదనుజభయంబు సరియ భువనంబులకున్.

122

ఈశ్వరుఁడు త్రిపురాసురుల నిర్జించుట

వ.

అని యీప్రకారంబున బ్రహవిష్ణువులు పురందరపురోగము లగుబృందారకులతోడం గూడి యభినందించినం బరమానందంబునుం బొంది యబ్భువనగోప్తసప్తపాతాళభువనగర్భగోళంబునందుండి యావిర్భవంబునొందిన దివ్యస్వయంభూజ్యోతిర్లింగమూర్తి భీమేశ్వరుండు నిర్వికల్పంబును నిరస్తసమస్తోపాధికంబును నైన నిష్కళంకస్వరూపంబు విడిచి యారకూటపాటలంబై కుసుంభచ్ఛాయనగు జటాపటలంబును, బాండురపుండరీకముకుళడుండుభంబులను శంకనంకురింపం జేయంజాలు బ్రహ్మకపాలమాల్యంబును, జిఱునవ్వుజిగి మెఱుంగిడిన చెక్కుటద్దంబుల నీడ చూచు నిద్దంపునాగకుండలంబులును, గ్రొత్తయఱసంజకెంజాయ రంజిలు కాఱుమొగులుకైవడిఁ జిలుపచిలుపని నెత్తురుల జొత్తిల్లిన పచ్చియేనికతోలుపచ్చడంబును, గంఠోత్కంఠభువనభవనరక్షణదాక్షిణ్యలక్షణకస్తూరికాలేపననైపథ్యంబునుం బోని కాలకూటవిషమషీకంఠంబును, సాయాహ్నసమయసంఫుల్లమల్లికాకుసుమసముల్లాసంబు నుల్లసంబాడు తెల్లనిమేనును, మొఱకుఁదనంబున నేతెంచిన కఱకుచెఱకువిల్తుని జూఱఁబుచ్చినదై చిగురుఱేలన నుప్పతిల్లుచు మినుమినుకు మనునులివేఁడిచూపువలనఁ గోపాటోపావార్యహవ్యవాహనాడంబరం బగులలాటలోచనజ్వలనంబు ప్రజ్వలించి నికటజటాటవీవాటంబు నాస్ఫోటించునోయని యవధ