పుట:భీమేశ్వరపురాణము.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

87


తే.

అందుమణికర్ణికాగ్రసింహాసనమున, లక్ష్మి యుదయించి హస్తపల్లవమునందుఁ
బసిఁడిపూదండఁ బూజించెఁ బద్మనయను, నర్థి వరియించె లీలాస్వయంవరమున.

95

దేవాసురు లమృతమునకై పోరుటయు శ్రీమన్నారాయణుండు దేవారుల వంచించుట

.

ఉ.

ఱంతులు మీఱి మిక్కిలిగ ఱాఁగతనంబున దొమ్మి చేసి దు
ర్దాంతపరాక్రమోన్నతులు దానవదైత్యులు వేల్పువెజ్జు ధ
న్వంతరిచేతి దుగ్ధమయవార్ధిసుధారసపూర్ణకుంభమున్
సంతనకట్టి పుచ్చుకొని చయ్యన నేగిరి నిర్విశంకతన్.

96


వ.

అప్పుడు.

97


క.

నారాయణుండు మాయా, నారీరూపమునఁ గపటనాటకలీలా
పారాయణత హరించెను సు, రారులచే నమృతకలశ మాసమయమునన్.

98


చ.

అమృతముఁ గోలుపోయి విబుధారులు గంధగజాసురాంధక
ప్రముఖులు మోములందు వినఁబాటు దలిర్పఁగఁ గూడియున్నచో
నమరఁగ నారదుండు గగనాగ్రమునం జనుదెంచి వారికిం
బ్రమదముతోడ నిట్లనుచుఁ బల్కెను వాక్పరిపాటి యొప్పఁగన్.

99

నారదోక్తి నసురు లీశ్వరుని బూజించి వరంబులు వడసి లోకముల బాధించుట

శా.

రక్షోనాయకులార నిర్జరవరవ్రాతంబుచేతన్ సుధా
భిక్షాపాత్రము వోయెనంచు మదిలో బెగ్గిల్లఁగా నేటికిన్
రక్షార్థంబు భజింపరాదె యభవుం ద్రైలోక్యకుక్షింభరున్
దక్షారామపురాధినాథుని సుధాధామార్థచూడామణిన్.

100


క.

అని నారదుండు పల్కిన, విని యందఱు భీమనాథు విశ్వేశ్వరునిన్
ఘనభక్తి దక్షమునిరా, డ్వనమధ్యమునందుఁ గొల్చి వర్ధితబలులై.

101


మ.

త్రిపురావాసులతోఁ గూడి కడిమిన్ దేవాహితుల్ లోకముల్
తపియింపంగఁ దపంబు చేసిరి దృఢస్థైర్యంబు పాటించి పా
శుపతాచారనిరూఢి నందఱును సంశుద్ధాంతరంగంబులం
దుపమాతీతుని భీమనాయకుని నాద్యున్ శంభు సేవించుచున్.

102


సీ.

అరుణోదయంబున నాకాశవాహినీ, హేమాంబుజంబుల నిందుధరుని
మిహిరోదయంబున మహిసాక్షిగుగ్గుల, ధూపధూమంబుల దురితహరుని
సంగమంబున గంధసారకుంకుమచంద్ర, జంబాలమునఁ బుష్పచాపమథను
మధ్యాహ్నమునఁ బక్వమధురాన్నపాయసా, పూపాజ్యదధిఫలంబులఁ ద్రినేత్రు