పుట:భీమేశ్వరపురాణము.pdf/102

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

శ్రీ భీమేశ్వరపురాణము

శివునియాజ్ఞను సురాసురులు విఘ్నేశుని బూజించి
పాల్కడలి తరియించి చంద్రాదులఁ బడయుట

తే.

మనము విఘ్నేశు సేవింప మఱచినార, మతని సేవింపకున్న నేలా ఫలించు
నఖిలకార్యంబులను నవశ్యము ఫలించు, నర్థిఁ గార్యార్థ మిభవక్త్రు ననుసరింప.

88


మ.

అని యంభోధితటోపకంఠమున దక్షారామమధ్యంబునన్
ఘనునిం దాండవవిఘ్ననాయకు మహాకాయున్ సముత్తప్తకాం
చనసంకాశు ననేకరత్నఖచితస్వర్ణాగ్రసింహాసనం
బునఁ గూర్చుండఁగఁ బెట్టి భక్తిపరతం బూజించి రవ్యగ్రులై.

89


సీ.

జలకమార్చె బలారి సప్తగోదావర, సలిలధారాహేమకలశసమితి
గర్పూరకస్తూరికాగంధసారంబు, నలఁదె వైనస్వతుం డంగకములఁ
బ్రన్నఁగాఁ బెనగొన్న బ్రహ్మసూత్రంబులఁ, బసపూన్చి యర్పించెఁ బద్మభవుఁడు
పారిజాతకతరుప్రసవమాల్యంబులు, వక్షస్స్థలంబున వైచె శౌరి


తే.

ధూమకేతుండు మహిసాక్షిధూప మిచ్చెఁ, బూన్చె యక్షాధిపతి మణిభూషణముల
నంధకాసురుఁ డిడియె దూర్వాంకురములు, వీచెఁ బవనుండు కుంచి యవిఘ్నపతికి.

90


వ.

అనంతరం బామోదకాపూపపాయసఘృతమధుక్షీరశర్కరాసూపజంబూకపిత్థచూతఖర్జూరకదళీనారికేళఫలపుండ్రేక్షుసమన్వితంబుగా మహోపహారంబుల గల్పించి వేల్పులుఁ బ్రావేల్పులును ననల్పభావనావిశేషంబుల నశేషవిధంబుల మూషకవాహనునకుఁ బ్రదక్షిణంబులు ప్రణామంబులుం జేసి వలగొని క్రమ్మఱ పయోనిధిమథనంబునకుఁ బ్రారంభించిన.

91


తే.

మందరాచలమంథానమథ్యమాన, దుగ్ధపాథోధిలో సముద్భూతమయ్యె
బాలశశిరేఖ యసురులు వేలుపులును, నిచ్చి రవ్వస్తు వర్థి భీమేశ్వరునకు.

92


వ.

వెండియుఁ దరువందరువఁ గల్పతరువును సప్సరస్సతులును గౌస్తుభమాణిక్యంబును నుచ్చైశ్రవం బనుహయంబును నైరావతం బనుధవళగజంబును నాదిగా సకలకామదంబులు సర్వమంగళాస్పదంబులు నిఖిలభువనమోహనంబులు నైన పదార్థంబు లుద్భవించెఁ దదనంతరంబ.

93


క.

తరతరమ దరువఁదరువం, దరియం దుదయంబు నొందె ధన్వంతరి సా
గరమునఁ గడుగరగరనై, కరమునఁ గరమమరు నమృతకలశముఁ దానున్.

94


సీ.

సంపూర్ణపూర్ణిమాచంద్రబింబంబుతోఁ, బుట్టెఁ దెల్లనితమ్మిపువ్వుమొగ్గ
విరిసె నొయ్యొయ్యన వేలావనీవాటి, పవమానకోమలాస్ఫాలనమున
వాసించె నఖిలదిగ్వలయంబు మధురవి, స్తారకేసరధూళిసౌరభములు
నంభోజమధ్యంబునం దుద్భవం బొందె, మహితకాంతిచ్ఛటామండలంబు