పుట:భీమేశ్వరపురాణము.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

81


తే.

మమ్ము రక్షించి తని యేల మాటిమాటి, కభినుతింపంగ దక్షవాటాధినాథ
తల్లిదండ్రులు రక్షింపఁ దలఁపకుండ్రె, ప్రజల భీమేశ బహువిధోపద్రవముల.

79


సీ.

శ్రీభీమనాయకా శివ మమ్ము రక్షింపు, విశ్వైకనాథ దేవియును నీవు
శ్రీనీలకంధరా శేషాహిభూషణ, మమ్ము రక్షింపు మమ్మయును నీవు
రక్షింపు మమ్ము శ్రీదక్షవాటికా, వేదాంతవేద్య దేవియును నీవు
దక్షిణాంబుధితటీధామ నిర్జితకామ, మమ్ము రక్షింపు మమ్మయును నీవు


తే.

వేడ్క రక్షింపు దేవ దేవియును నీవు, ప్రతిభ రక్షింపు గిరిశ యంబయును నీవు
దుగ్ధపాథోధభవవినిర్ధూమధామ, కాలకూటాగ్నిసంహారకారి యభవ.

80


క.

శరణము భజింతు మభవుని, శరణము భజియింతు మర్ధచంద్రాభరణున్
శరణము భజింతు మీశుని, శరణము భజయింతు మద్రిజావల్లభునిన్.

81


తే.

సిరియు వాణియు మొదలైన సురపురంధ్రు, లఱ్ఱుగడుపును జల్లఁగా నఖిలషించి
నియమమునఁ గొల్తు రెవ్వని నిత్యకలన, నట్టిభీమేశు నినుఁ గొల్తు మహరహంబు.

82


సీ.

విశ్వంబు సృజియించువిధి మహేంద్రుఁడు గొను, వివిధాధ్వరముల హవిర్విభాగ
మగ్ని యాహుతి మోయు నమరసంఘమునకుఁ, బాపపుణ్యంబు లేర్పఱచు యముఁడు
ప్రత్యవాయములచే బ్రతుకు రాక్షసతతి, వర్షించుఁ బర్జన్య వరుణమూర్తి
గ్రహచక్రవాళంబు గాలి యెప్పుడు మోచుఁ, గొండ్రు సంతృప్తి లగ్గునఁ బితరులు


తే.

నవనిధానములును యక్షనాథుఁ డేలు, నాసదాశివుఁ డీశానుఁడై తనర్చు
బరఁగ నేనాజ్ఞనింద్రియప్రతతి నడుచు, నట్టిభీమేశ్వరుఁడు మాకు నభయ మొసఁగు.

83


సీ.

వరుణుఁ డెవ్వనియాజ్ఞ వారాశిఁ బాలించు, గాలి యెవ్వనియాజ్ఞ గంప మొందు
నవనిధానములు చింతారత్నసురభులు, యక్షరా జెవ్వనియాజ్ఞ నేలు
నెవ్వని యాజ్ఞ నర్కేందుగ్రహంబులు, చదలమార్గంబున సంచరించు
శైలకాననవార్ధిసహితమౌనీధాత్రి, నహినాథుఁ డెవ్వనియాజ్ఞఁ దాల్చు


తే.

నట్టి భీమేశు వేదవేదాంతవేద్యు, సర్పకేయూరు దేవతాసార్వభౌము
సప్తగోదావరోత్సంగసన్నివిష్ణు, నాశ్రయింతుము నిన్నుఁ జంద్రార్ధమౌళి.

84


వ.

దేవదేవ మహాదేవ సదాశివ యాశ యీశాన తత్పురుష యఘోర సద్యోజాత వామదేవాఖ్యాన పంచవదన మూర్తివిశేష ప్రకృతిప్రధానకారణ! మీకు సాష్టాంగనమస్కారంబు.

85


క.

నీమహిమార్ణవమునకును, సీమాంతము గలదె రాజశేఖర దక్షా
రామపురధామ శంకర, భీమేశ్వర నీలకంఠ పేశలకరుణా.

86


వ.

అని యనేక ప్రకారంబుల బృందారకదైత్యులు తన్నుఁ బ్రస్తుతింపఁ గాలకూటంబు హరించిన పంచాననుం డగుభీమేశ్వరుండు హరివిరించిపురందరాదుల నాలోకించి యిట్లనియె.

87