పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
భారత స్వాతంత్య్రోద్యామం-ముస్లిం ప్రజాపోరాలు

27 తమ బలగాల రాకను ముందుగా శత్రువుకు తెలిపి దాడులు జరిపిన సంఘటనలకు మూసా షా పేర్గాంచారు. ఆనాడు ఆయన సాగించిన పోరాల తీరు ఆ తరువాత కాలంలో అల్లూరి సీతారామరాజు సాగించిన మన్యం పోరును గుర్తుకు తెస్తుంది.

1787 ప్రాంతంలో ముసిద్ధా పరగణాకు చెందిన జమీందారు ప్రాసాదం మీద దాడికి మూసా షా సిద్ధం కాసాగారు. ఆ విషయం తెలిసిన జమీందారు ఆ సమాచారాన్ని ముషీరాబాద్‌ కలెక్టర్‌కు తెలిపాడు. మూసా షా ఏ క్షణాన్నైనా దాడిచేయవచ్చని సాయుధ దాళాలను పంపి రక్షించవలసిందిగా కోరాడు. ఆ విషయం వేగుల ద్వారా మూసా షాకు తెలిసింది. జమీందారు చర్యపట్ల ఆగ్రహిస్తూ ఆయన ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో '... నా మీద ముషీరాబాద్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసావు. అయితే ఏమి లాభం. నేను నీ నుండి కోరిన నగదును తప్పక తీసుకుపోతాను. ధనం సిద్దం చెయ్యి....', అని పేర్కొంటూ సమాచారం పంపి నిర్దేశిత సమయాన జమీందారు భవంతిని చేరుకున్నారు. ప్రకటించిన రెవిన్యూ సొమ్మును రాబట్టుకుని నిష్క్రమించిన మూసా షా కంపెనీ పాలకులకు సవాల్‌ విసిరారు.

ఆనాడు సామాన్య ప్రజానీకంతోపాటుగా పలువురు జమీందారులు కూడా మూసా షాకు చేయూతనిచ్చారు. ముఖ్యంగా ప్రజలు అనుక్షణం అప్రమత్తులై మూసా నేతృత్వంలోని యోధులను కాపాడుకున్నారు. 1788 న్‌ 22న ఆకస్మికంగా శత్రువు దాడిచేయగా మూసా షాను, ఆయన సహచరులను ప్రజలు ఎంత చాకచక్యంగా కాపాడింది దినాజ్‌పూర్‌ కలెక్టర్‌ రాసిన లేఖ ద్వారా బహిర్గతం అవుతుంది. మూసా షా నాయకత్వంలోని పోరాట వీరులకు పాత జమీందారులు తోడ్పాటునిచ్చారు. ప్రజల మద్ధతుతో ఏర్పాటు చేసుకున్న వేగుల ద్వారా కంపెనీ బలగాల కదలికలను పసికట్టి క్షణాలలో మటుమాయమై, ఆకస్మాత్తుగా దాడి చేసి కంపెనీ అధికారులను మట్టికరిపించటంలో మూసా షా తన అన్నను అక్షరాల అనుసరించారు. స్వదేశీ రాజులు, రాణులతో మూసా షా చేతులు కలిపారు. ఆయన సన్యాసుల నేతలు భవాని పాథక్‌, దేవీ చౌదరాయణ్‌లతో కలిసి పలు పోరాటాలలో పాలుపంచుకున్నారు. మజ్నూషా సన్యాసుల దళానికి నాయకత్వం వహించిన విధాంగానే మూసా షా కూడ 1786 ఫిబ్రవరి 17న 200 మంది సన్యాసుల దళానికి నాయకత్వం వహించారని కెప్టన్‌ అలెగ్జాండర్‌, రంగాపూర్‌ కలెక్టర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

మూసా షా తన బలగాలకు ఆధునిక శిక్షణ కల్పించారు. కంపెనీ సేవలోనున్న స్వదేశీయులలో వ్యతిరేకతను రెచ్చగొట్టి స్వపక్షంలోకి ఆకర్షించారు. ఈ బలగాలన్నిటికీ కంపెనీ బలగాల తరహాలో దుస్తులు, ఆయుధాలు ఏర్పాటు చేసారు. గూఢచారి దళాన్ని మరింత పటిష్టం చేసారు. గెరిల్లా పోరాటంలో ఆరితేరిన మూసా షా శత్రువును ఊపిరి పీల్చుకోనివ్వకుండా దాడులు చేసి చికాకు పర్చారు. భారీఎత్తున బలగాలు ఉన్నప్పటికీ కంపెనీ పాలకులకు మూసా షా తిరుగుబాట్లను నిలువరించలేకపోవటం విశేషం.

ఆనాడు పోరాట వీరులకు ఆపద సమయంలో తలదాచుకోడానికి నేపాల్‌ పర్వత ప్రాంతాలు బాగా ఉపయోగపడేవి. ఈ పరిస్థితిని గమనించిన కంపెనీ అధికారి వారెన్‌ హేస్టింగ్స్ నేపాల్‌ పర్వత సానువుల మీద దృష్టి సారించాడు. ఒక వైపు ఫకీర్లు-సన్యాసులకు నిలువ నీడలేకుండా చేయటమే కాకుండా, కంపెనీ సరుకుల ఎగుమతులు-దిగుమతులు పెంచటం కోసమంటూ నేపాల్‌ రాజుతో స్నేహం చేసాడు. ఒప్పందాలు కుదుర్చుకున్నాడు.