Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయ్యద్ నశీర్ అహమ్మద్ 28


ఫలితంగా ఫకీర్లు, సన్యాసులకు నేపాల్ ప్రాంతంలో తలదాచుకునే వీలు లేకుండా పోయింది. ఫకీర్ల-సన్యాసుల పోరాటాన్ని ఎలాగైనా అణిచేయాలని నిర్ణయించుకున్న కంపెనీ పాలకులు ఫకీర్ల-సన్యాసులు చేతికి చిక్కితే ఎక్కడికక్కడ హతం చేయమని, ఉరి తీయమని, అతి కఠినంగా వ్యవహరించమని సైనికాధికారులకు ఉత్తర్వులు జారీచేసారు. ఈ పరిస్థితుల వలన ఫకీర్లకు, సన్యాసులకు కష్టకాలం దాపురించింది. అయినప్పటికీ ఆ యోధులు ఫిరంగీల మీద ప్రకటించిన పోరాటాన్ని విరమించలేదు. అవకాశం లభించిన చోటల్లా కంపెనీ పాలనను సవాల్ చేశారు. కంపెనీ అధికారులు పోరాట వీరుల పట్ల కిరాతకంగా వ్యవహరించారు. చిత్రహింసలు, ఉరితీతలు సామాన్యమైపోయాయి. మూసా షా ఫకీర్ ఎక్కడ కన్పించినా కాల్చివేయాల్సిందిగా, ఆయన చేత జిక్కినట్టయితే తక్షణమే ఉరి తీయాల్సిందిగా కంపెనీ అధికారి మేజర్ మైట్లాండ్కు కంపెనీ పాలకుల నుండి ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి. అటువంటి ప్రమాదకర వాతావరణంలో మరణం తప్ప మరొక బహుమతి లభించదని తెలిసి కూడా అత్యంత ధైర్యసాహసాలతో ఫిరంగీలతో పోరాడుతూ మూసా షా ఫకీర్ 1792 మార్చిలో తుపాకీ గుళ్ళకి బలయ్యారు.

గురువుకు తగ్గ శిష్యుడు చిరాగ్ అలీ షా
⁠మజ్నూ షా నాయకత్వంలో రాటు తేలిన మరొక నాయకుడు చిరాగ్ అలీ షా. ఫిరంగీలను తరిమి కొట్టడమే సమస్యలకు పరిష్కారంగా భావించిన చిరాగ్ అలీ షా గురువు బాటలో నడిచారు. చిరాగ్ అలీ కంపెనీ దళాల మీద దాడులు జరిపి, పలుమార్లు పరాజితులను చేసారు. ఆయన కూడా గెరిల్లా పోరాటాన్ని అనుసరించారు. 1793లో మాల్దా వద్ద జరిగిన పోరాటంలో కంపెనీ బలగాలు అత్యధికం కావటంతో చిరాగ్ అలీ తన బలగాలను తోడ్కొని అనూహ్యరీతిలో అదృశ్యమైనారని కంపెనీ అధికారులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ ఉన్నత అధికారులకు సమాచారం అందించారు. ఈ సంఘటనలను బట్టీ చిరాగ్ అలీ షా శక్తి సామర్థ్యాలు వెల్లడవుతాయి. చిరాగ్ అలీ షాతో పాటుగా ఆయన జట్టులో మరొక వీరుడు ఫీరా గుల్ షా ఫకీర్ కూడా ప్రధాన పాత్ర నిర్వహించారని డా॥ శాంతిమోయ్ రాయ్ పేర్కొన్నారు. ఉమ్మడి లక్ష్యాల సాధన కోసం సన్యాసుల నాయకులతో కలిసి చిరాగ్ అలీ షా ఐక్యపోరాటాలు సాగించారు. 1790లో చిరాగ్ అలీ సన్యాసుల నేతలు మోహన్ గిరితో కలిసి భారీ బలగాలతో దాడులకు సిద్ధం అవుతున్నారని మైమ్ సింగ్ కలెక్టర్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సమాచారం అందించాడు. అంతేకాదు వారన్ హేస్టింగ్స్ కూడా, చిరాగ్ అలీ సన్యాసుల నాయకులతో కలిసి చేసిన పోరాటాలను సవివరంగా పేర్కొన్నాడు.

⁠ ఆ తరువాతి కాలంలో సన్యాసుల - ఫకీర్ల మధ్యన అభిప్రాయభేదాలు పొడచూపాయి. ఈ విభేదాలు ఎంత దూరం వెళ్ళాయంటే చిరాగ్ అలీ లాంటి నాయకుల మరణానికి కారణమయ్యాయి. ఆ సమయంలో సన్యాసులు దళాలకు మోతి సింగ్ గిరి నాయకత్వం వహిస్తున్నారు. బకాయిల వసూలు విషయంలో ఆయనకు చిరాగ్ అలీకి మధ్యన మనస్పర్థలు ఏర్పడ్డాయి. 1792 ప్రాంతంలో బకాయిలు డిమాండ్ చేస్తూ పంపిన