పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

61


వీడుటచేతను భూలోకమున జైనబౌద్ధమతములు పేట్రేగుచున్నవి' అని నివేదించెను. 'తన్మతనాశనార్థమై భూమిలో నవతరింపుము అని శివుఁడు వీరభద్రు నాజ్ఞాపించెను. శివాజ్ఞ చొప్పుననే వీరభద్రుఁడు పురుషోత్తమభట్టు గర్భమునఁ బ్రవేశించెను. పురుషోత్తమభట్టు కలలోఁ గనుపడి “మీకుఁ గొడుకు గల్గును. రాముఁడని పేరిడుఁడు. ఆతఁడు దక్షిణాపథమున జైనమతస్థుల నోడించి తన్మతనాశనము చేయును” అని తెల్పెను. అట్లే కొడుకు గల్గెను. రాముఁడని పేరిడిరి. శివభక్తిని బోధించిరి. ఏకాంత భక్తినిబట్టి యాతని కేకాంతరామయ్యని పేరయ్యెను. త్రికరణశుద్ధిగా నాతఁడు శివతన్మయుఁడై దక్షిణదేశమునఁగల సోమనాథదేవాలయములకెల్ల నేఁగి యా యా సోమనాథదేవులనెల్ల నారాధించెను. ధార్వార్ మండలమున లక్ష్మేశ్వర్ అనే హలల్గేరియొద్ద సోమనాథదేవాలయమున స్వామిలింగమూర్తిని గొలుచుచుండఁగా నా స్వామి ప్రత్యక్షమై "ఆబ్లూరి కేఁగి నీ వక్కడనేయుండి తలయయిన నొసఁగి జైనుల నోడఁగొట్టుము” అని యాజ్ఞాపించెను. అట్లే అబ్లూరి కేఁగి సన్న్యాసివలె బ్రహ్మేశ్వరదేవాలయము కడ నాతఁడు శివు నారాధించుచు నుండెను. సంకగౌండుఁడని పేరుగల గ్రామాధికారితోఁగలసి యా యూరిజైనులు జినదేవుఁడే భగవంతుఁడని యా శివాలయముఁ జేరి జినుని మ్రొక్కసాగిరి. 'శివుఁడే పరదైవ' మని యేకాంతరామయ్య వాదించెను. సృష్టిస్థితిలయకారణము శివుఁడే యని రాద్ధాంతపఱిచి వారి యారాధనమును నిరాకరించి గర్హించెను. “వట్టిమాట లెందుకు? శివుఁడే పరదైవమగునేని నీ తల నాయన కప్పగించి మరలఁ బడయుము. అట్లు చేసెదవేని నీవాదము నెగ్గెనని మే మొప్పుకొందుము. జినవిగ్రహమును బాఱవైచి శివలింగమునే యారాధింతుము” అని వారనిరి. ఏకాంతరామయ్య యంగీకరించెను. తాటాకులమీఁదఁ బంతములు వ్రాసికొనిరి. శివగీతములు పాడుచు నేకాంతరామయ్య తన తలఁదఱుఁగుకొనెను. ఏడవనాఁటి కాతనితల మరల వచ్చెను. జైనులు చలచల్లఁగా జాఱిరి. తమమాట చెల్లించుకొనరయిరి. జైనులెంతో జాగ్రత్తతో రక్షించుచున్నను గూడ నేకాంతరామయ్య వారారాధించు జినదేవుని తల విఱుఁగఁగొట్టి దానిని దానారాధించు శివదేవునకుఁ గానికగాఁ గొని తెచ్చెను.