పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

బసవపురాణము


లింగవంతులయి వీరమాహేశ్వరులు కాఁజొచ్చిరి. అంతకుముందు శివాలయములందు దేవలకులు బోయలకు శివప్రసాద మొసఁగు చుండెడివారు. బసవన్న మతము వచ్చిన తర్వాత వారు శివప్రసాదమును దామే భుజింపఁ జొచ్చిరి. బోయల కియ్యరయిరి. పెద్దతగ వేర్పడెను. బోయలు బిజ్జలుని దర్శించి మొఱపెట్టుకొనిరి. బిజ్జలుఁ డిది యేమి యన్యాయ్యమని బసవనిఁ బిలిచి యడిగెను. బసవన వాదించెను. “శైవులవలనఁ బ్రసాదము బోయలకుఁ బోవచ్చునుగాని వీరమాహేశ్వరులవలన బోయలకుఁ జెల్లఁగూడ” దనెను. “కాదందురేని, నేను సంగమేశ్వరదేవునకు నేఁడు విష మర్పింతును. బోయ లారగింతురుగా” కనెను. “వివిధపక్వాన్నము లారగింప మీరును, విష మారగింప మేమునా” యని బోయలు మొఱపెట్టిరి. “శివున కర్పించి విసము బసవన యారగించునది. ఆతఁడు చావకున్న నిఁక మీదఁ బ్రసాదము మాకక్కఱలేదు. చచ్చిన మాకీయవలయు” నని బోయలనిరి. బిజ్జలుఁడంగీకరించెను. బసవన్న యట్లే సంగయదేవునకు విషనైవేద్యము పెట్టి తానును దక్కిన భక్తులు నారగించిరి. బోయలు తగవు విడిచి శరణాగతులయిరి. బసవఁడనుగ్రహించెను.

జగదేవుఁడను దండనాయకుఁడు (ఈతఁడును బసవనగోష్ఠిలోనివాఁడే కాని యప్పటి కింకను, వర్ణాశ్రమధర్మముల విడనాడలేదు) తన యింట శుభకార్యముఁ జేసికొనుచు, బసవన్నను భోజనమునకు రమ్మని ప్రార్ధించెను. ఆతఁడు శరణులరాక కోర్వఁగలవేని వత్తుననెను. జగదేవుఁడు వంటకము కాఁగానే బసవన రాకకుఁబూర్వమే బ్రాహ్మణసమారాధనము గావింపఁజొచ్చెను. పరిచారకుఁడొకఁ డీవార్త బసవనకుఁజెప్పెను. ఆతఁడు గోపించి తాను భోజనమునకుఁ బోవకుండెను. తర్వాత నా జగదేవుఁడు బసవనను బిలుచుకొనిపో వచ్చెను. బసవన తెర యడ్డము గట్టించెను. భక్తజనాళినుండి తొలఁగిపొమ్మని జగదేవునిఁ దెగడెను. “ఈశ్వరభక్తుఁడవై యుండి కర్మచండాలురతోఁ గలసి కుడిచితివి; పాపివి; పోపొ"మ్మనెను. పెక్కుదెఱఁగుల గర్హించెను. జగదేవుడు “కర్మబద్ధుఁడనైతిని; పాపిని. నాకిఁకఁ బ్రాయశ్చిత్తము లేదు. ప్రాణము విడుతును” అని మొఱవెట్టెను. భక్తుల యనుమతిని బసవన్న యిట్లు చెప్పెను. "ఇఁకఁగొలఁ