పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

35


ద్విపదలుగా, యక్షగానములుగా బసవపురాణమును రచియించినవా రింకను బెక్కురు గలరు. బసవపురాణము సంస్కృతమునకుఁగూడఁ బరివర్తితమైనది. కాని, యాసంస్కృతగ్రంథమును జూచి పలువు రది మిక్కిలి ప్రాచీనమైనదనియు, దానిఁబట్టియే భాషాగ్రంథములు పుట్టెననియు, నది వ్యాసప్రణీతమనియు భ్రమింతురు. ఆ గ్రంథమం దట్లే కలదు. గద్య మిట్లున్నది:

“ఇతి శ్రీ బాదరాయణమహర్షి ప్రణీతే శ్రీ బసవేశ్వర పురాణే స్వరూప గ్రంథే పరమరహస్యే స్కందాగస్త్యసంవాదే త్రిచత్వారింశో౽ధ్యాయః.”

ఇది ప్రాచీనమయినదిగాని వ్యాసప్రణీతముగాని కాదనియుఁ గృష్ణామండలమందలి యేలూరిలోఁ గాపురమున్నవారు కందుకూరివారు దీనిని దెనుఁగు బసవపురాణమునుబట్టి సంస్కృతమునకుఁబరివర్తింపఁజేసిరనియు దానిలోని ద్విచత్వారింశాధ్యాయమందలి కథనుబట్టి మనము గ్రహింపవచ్చును. అందిట్లున్నది :-

"కృష్ణాగోదావరీనదుల నడిమిదేశమున హేలాపుర (ఇది యేలూరి కిటీవలి వారు పెట్టిన పేరు) మని నగరముగలదు. ఆ నగరమున 'పేరలింగ' మని నీతిశాస్త్రవిశారదుఁడొకఁడు పుట్టఁగలఁడు. అతఁడు లింగధారి; శివార్చనపరుఁడు. ఆయన భార్య వీరమ్మ. వారికి అమృతలింగమని కుమారుఁడు పుట్టును. ఆతఁడు శ్రీశైలమందు మల్లికార్జునదేవునిఁగూర్చి తపమాచరించును. మల్లికార్జునస్వామి ప్రత్యక్షమై నీకుఁ బుత్రుఁడనుగాఁ బుట్టుదునని వరమిచ్చును. అట్లే పుట్టును. అతని పేరు మల్లికార్జునుఁడే. ఆతఁడు మహాప్రాజ్ఞుఁడు; లింగార్చనవ్రతుఁడు. ఆయన జ్యేష్ఠపత్ని గురవమ్మ. వారికి వీరలింగమని కొడుకు పుట్టును. తర్వాత అమృతలింగము, వీరేశ్వరుఁడు, సాళ్వేశుఁడు, మూర్తిరాజు, కూడలిసంగయ్య అను వారు జనింతురు. పిదప నొకనాఁడు స్వప్నమున పాలంకి సదాశివుఁడను తమ గురువురూపముతో శివుఁడు ప్రత్యక్షమై మల్లికార్జునున కిట్లు చెప్పును. “నీగర్భమున నిఁక బసవేశ్వరుఁడు జన్మించును. ఆతనికి బసవేశ్వరుఁడని పేరిడుము. మీకు గురువయిన పాలంకి సదాశివాఖ్యుఁడగు నాచే నీ పుత్త్రులందఱకు లింగధారణముఁ