పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

బసవపురాణము


జేయింపుము” అని. ఆ స్వప్నముచొప్పుననే కొన్నాళ్ల కాతనికిఁ గుమారుఁడు కలుగును. ఆతనికి బసవేశ్వరుఁడని పేరిడుదురు. వారియింటిపేరు కందుకూరివారు. ఆతఁడు మహావిద్వాంసుఁడు, మహాదాత, అనేక రాజసమ్మానితుఁడు నగును. ఆతనికి గంగమ్మయని వీరమ్మయని యిర్వురు భార్యలగుదురు. అందు వీరాంబాబసవేశ్వరులయోగము గౌరీశంకరుల యోగమువలె శాశ్వతమై వెలయును” అని యాయధ్యాయము కథాసారము.

ఏలూరిలో కందుకూరివారని ప్రఖ్యాతులగు నారాధ్యబ్రాహ్మణులు నేఁడు నున్నారు. అత్తలూరిపాపకవి చెన్నబసవపురాణమును గృతినందినవా రాయింటివారే. సోమనాథుని ద్విపద బసవపురాణము నింతకుముందుఁ జక్కగా నచ్చునఁ గూర్పించినవా రావంశమువారే. ఆ గ్రంథముచివర వారు తమవంశావళినిగూడఁ జేర్చిరి. ఈ సంస్కృతబసవపురాణమున వర్ణితుఁడగు బసవేశ్వరుని నావంశావళిని బట్టి గుర్తింపనగును.

శంకరకవికృతిగా సంస్కృతబసవపురాణమును గర్ణాటకకవిచరిత్ర పేర్కొనుచున్నది. అది యిదిగాక వేఱొకటి కావచ్చును. ఏలనగా నిది వ్యాసప్రణీతమని కలదు.

బసవేశ్వర చరిత్రము

(బసవపురాణమునుబట్టి)

శ్రీశైలమునకుఁ బశ్చిమభాగమునఁ గర్ణాటదేశమున హింగుళేశ్వరభాగవాటియను నగ్రహారముగలదు. (ఇది యిప్పటి బిజపూరు జిల్లాలో నున్నది. ) అందు మండెఁగ మాదిరా జనుబ్రాహ్మణుఁడు గలఁడు. ఆయన భార్య మాదాంబ. నందీశ్వరుఁ డామె గర్భమునఁ బుత్త్రుఁడై జనించెను. ఆ బాలుని జననవేళకుఁ గూడలి సంగమేశ్వరదేవుఁడు తాపసవేషమున వచ్చి లింగార్పిత మాతనికిఁ గుడుపవలదని మాదాంబకు బోధించిచనెను. తల్లిదండ్రులు బసవఁడని యా శిశువునకుఁ బేరిడిరి. గర్భాష్టమవర్షమున నాతనికిఁ దండ్రి యుపనయనము చేయ