పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

బసవపురాణము


సంస్కృతమున శివభక్తుల (అఱువదిమూవుర) చరిత్రములఁ జెప్పుగ్రంథములు గలవు. అవి సోమనాథునికిఁ దర్వాతివి కానిచో వానినిగూడ నీతఁడు చూచి యుండవచ్చును.

బసవపురాణగౌరవము - దాని పరివర్తనములు

సోమనాథోపజ్ఞముగా వెలసినదైనను బసవపురాణము శైవులలో మతగ్రంథముగా బహుప్రఖ్యాతిని బడసెను. ఆంధ్రదేశముకంటెఁ గర్ణాటదేశమున దీనికి గౌరవము మిక్కిలి యెక్కువ. బసవేశ్వరుఁడు పెంపొందించిన వీరశైవము (దీనిస్వరూపము ముందు తెలియును.) హెచ్చుగాఁ గర్ణాటదేశమునఁ బెంపొందెను గాన, తచ్చరిత్రమునకుఁగూడ నక్కడ గౌరవమెక్కువ. తన ఘనకృతులు తెనుఁగుననే వెలయించినవాఁ డయినను, సోమనాథుఁడు గూడఁ గర్ణాటదేశముననే హెచ్చుగా గౌరవముఁ బడసెను. ఆంధ్రదేశమునఁగూడఁ నారాధ్యబ్రాహ్మణులకంటె వీరశైవులగు జంగములు లింగబలిజెలు మొదలగువారు దీనిని మిక్కిలి గౌరవముతో నారాధింతురు. శుభాశుభసమయములం దీగ్రంథమును వారు పారాయణము చేయుచుందురు. ఇందలి యుపాఖ్యానము లనేకప్రబంధములుగా నితరకవులచే రచితము లగుటేకాక యీ గ్రంథమే యనేకకవులచే ననేకవిధరచనలతో ననేకభాషలలోనికిఁ బరివర్తితమయినది. కర్ణాటకమున భీమకవి దీనిని షట్పదివృత్తములలో ముక్కకుముక్కగాఁ బరివర్తించెను. రాఘవాంకకవి 'వృషభేంద్రవిజయ' మనుపేర వృత్తములలో రచియించెను. ఇంకను గన్నడమునఁ బెక్కుగ్రంథములు గలవు. సోమనాథుని తెలుఁగుకృతిని, భీమన కర్ణాటకృతిని ననుసరించి యరవమున నొకకవి బసవపురాణమును బద్యకృతిగా రచియించెను.

తెలుఁగునఁ బిడుపర్తి బసవన పద్యకృతిగాక యింకను బెక్కులు బసవపురాణములు గలవు. బెజవాడ వాస్తవ్యుఁడు, శ్రీపతి పండితారాధ్య సింహాసనారూఢుఁడు నగు మహాదేవారాధ్యుఁ డొకబసవపురాణమును, బద్యకృతిని రచియించెను. మఱియు నాపస్తంబసూత్రుఁడు, హరితసగోత్రుఁడునగు తుమ్మలపల్లి నాగభూషణకవి వేఱొక బసవపురాణమును బద్యకృతినే రచియించెను.