పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

31


బసవపురాణము

ఈ గ్రంథము ప్రధానముగా బసవేశ్వరుని జీవితచరిత్రమును జెప్పుచున్నది. బసవేశ్వరుఁడు లింగైక్యమందినపిదప నల్పకాలమునకే (ముప్పది యేండ్లకే) రచితమగుటచే నిది తచ్చరిత్రమును దెలుపు సాధనములలో ముఖ్యమయిన దనవచ్చును. బసవేశ్వరుని చరిత్రమును దెలుపునవి, తజ్జీవితకాలముననే వెలసినవి, శాసనములు మొదలగు సాధనము లింతకంటె బలవంతము లింతవఱకుఁ గానరాలేదు.

ప్రధానముగా నిందు బసవేశ్వరచరిత్రమే వర్ణితమయినను, అనుప్రసక్తములుగా నుపాఖ్యానములుగా నింకను బలువురు భక్తుల చరిత్రములు వర్ణితములయినవి. సోమనాథుఁడే తద్గ్రంథరచనమునకుఁ గథావస్తుసామగ్రిని గథాకోవిదులగు వృద్ధులవలన నుండియుఁ, బ్రాచీనులగు భక్తులును, బసవేశ్వరుఁడును, జెప్పిన పాటలు పదములు మొదలగు గేయరచనములవలన నుండియు గ్రహించినట్లు చెప్పుకొన్నాఁడు.

ఆతతబసవపురాతనభక్త
గీతార్థసమితియే మాతృక గాఁగఁ
బూరితంబై యొప్పు పూసలలోన
దారంబుక్రియఁ బురాతనభక్తవితతి
చరితలలోపల సంధిల్ల బసవ
చరిత మే వర్ణింతు సత్కృతి యనఁగ.....
ప్రస్తుతింపంగ సద్భక్తి విస్ఫురణఁ
బ్రస్తుతికెక్కినబసవని చరితఁ
జెప్పితి భక్తులచే విన్నమాడ్కిఁ
దప్పకుండఁగను యథాశక్తిఁ జేసి.”

బసవపురాణము సోమనాథోపజ్ఞమేయగుటను బయిద్విపదలు స్పష్టపఱుచుచున్నవి. కాని, యీ సోమనాథుఁడే పండితారాధ్యచరిత్రమున రెండుచోట్ల నిట్లు చెప్పినాఁడు:-