పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

బసవపురాణము


బసవన్నగీతముల్ వచరించువారు
బసవపురాణమొప్పఁ జదువువారు.....
అరుదగు దాసయ్య యఱువత్తుమువుర
చరితంబులను శ్రీబసవపురాణంబు
నేలలువెట్టంగ నింపుసొంపారు
శైలిమైఁ గ్రాలుచుఁ జదివెడువారు
చాతుర్య మెసఁగ బసవదండనాథు
గీతంబులాదిగా గీతాఢ్యులయిన
సకలపురాతనచారుగీతములు
ప్రకటించి ప్రకటించి పాడెడువారు.

- పండితారాధ్యచరిత్రము.

ఈ ద్విపదలు పండితారాధ్యులవారు శివరాత్రిమహోత్సవమును శ్రీశైలమున జరపనేఁగినప్పుడు శ్రీశైలమధిరోహించు భక్తులచేష్టల వర్ణించు పట్టుననున్నవి. వీనినిబట్టి చూడఁగా బసవపురాణ మాకాలమునకే యున్నట్టుగా నేర్పడును. సోమనాథుఁడు, శైవగ్రంథసంచయమునఁ దనబసవపురాణము పేరుగూడఁ జేర్చుకొనుట నభిలషించియుఁ దన బసవపురాణ రచనానంతర మది శ్రీశైల మధిరోహించు భక్తులచేఁ బఠింపఁబడుచుండుట నభిమానించియుఁ గాలదోషము గలుగుటను బాటింపక యట్లు చెప్పియుండవచ్చును. అంతేకాని, వాస్తవముగా నాకాలమునకు బసవపురాణము పుట్టలేదు.

బసవపురాణమున బసవేశ్వరచరిత్రముగాక మఱి మహారాష్ట్రులు, ఆంధ్రులు, కర్ణాటకులు, ద్రవిడులు నగు భక్తుల చరిత్రములుగూడఁ బెక్కులు వర్ణితములయినవి. అందాంధ్రకర్ణాట మహారాష్ట్ర దేశభక్తులలోఁ బ్రాయికముగాఁ బలువురు బసవేశ్వరుని సమకాలము వారగుదురు. కావున వారి కథలు బసవేశ్వరుని కథవలెనే వృద్ధశైవులు చెప్పుటచేతను, కొన్నిగొన్ని గేయములలో (బసవేశ్వర ప్రభృతులు రచించినవి) ప్రస్తుతములగుటచేతను దెలిసికొని పెంపొందించి వర్ణించియుండును. కాని, ద్రమిళభక్తుల కథలు కొన్ని మిక్కిలి ప్రాచీనములగుటచేతను, ద్రవిడభాషలో నా కథలు గ్రంథరూపమున