పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

బసవపురాణము


వాక్యముల నీతఁడు హెచ్చుగాఁజూపినాఁడు. వేదములు, వేదభాష్యములు (కొన్నిచోట్ల వేదభాష్యముల ప్రతీకముల నిచ్చినాఁడు. ఆ భాష్యము లెవ్వరివో? విద్యారణ్యభాష్య మప్పటికి పుట్టలేదు గదా!), పూర్వోత్తరమీమాంసలు పురాణములు మొదలుగా మతాచారవిధులకు సంబంధించిన సంస్కృతగ్రంథములనెల్ల నీతఁడు శోధించినాఁడు. శైవమతవ్యాపకులలో నాంధ్రులలో మల్లికార్జున పండితారాధ్యుఁడు, నీతఁడు గొప్ప విద్వాంసుడు. ఇతర మతఖండనాదుల పట్టులందు మల్లికార్జున పండితారాధ్యులు శివతత్వసారమునఁ జెప్పినయుక్తులనే యీతఁడు వివరించి తన పండితారాధ్యచరిత్రమునఁ జేర్చినాఁడు. బసవేశ్వరుఁడు పరమశైవుఁడై శివభక్తిరసామృతసింధువున నోలలాడిన భక్తాగ్రణియు, గేయకవితావిశారదుఁడును నగును గాని యీ యిర్వురంత గొప్పవిద్వాంసుఁడు గాఁడేమో!

పాండిత్య మిట్లుండఁగా నీతఁడు సంస్కృతాంధ్ర కర్ణాట ద్రవిడ మహారాష్ట్ర భాషలలోఁ గవితఁజెప్పనేర్చినవాఁడు. సంస్కృతాంధ్ర కర్ణాట భాషలలో నీతఁడు రచించిన గ్రంథములే కలవు. కాని, యీతని సంస్కృతకవిత యంత రసవంతమయినది గాదు. సంస్కృతవచనరచనయు నంత మేలయినదిగాదు. ఆంధ్రదేశమునను, ఆంధ్రవాఙ్మయమునను గడించిన గౌరవమున కంటె సోమనాథుఁడు కర్ణాటదేశమునను, గర్ణాటవాఙ్మయమునను హెచ్చుగౌరవము గడించెను. కాని, యాతని కర్ణాటరచనములు నంతగొప్పవి గావు. బసవపురాణ, పండితారాధ్యచరిత్రలలోఁ బ్రస్తుతులయిన పలువురు భక్తుల చరిత్రములు ద్రవిడ మహారాష్ట్ర దేశములందుఁ బ్రఖ్యాతములయినవి. ఆ భాషలలో నాతనికిఁ బరిచితి లేకున్నచో నాయాచరిత్రముల నాతఁడు సంధానింపఁజాలక పోవును. బసవపురాణమున నొకచోట ప్రౌఢమయిన ద్రావిడకృతినే ప్రపంచించినాఁడు. ఈతని యాంధ్రకవితానైపుణ్యము, ఆంధ్రభాషావైశారద్యము, గ్రంథవిమర్శన ప్రకరణమునఁబ్రస్తుతింతును. ఈతనికిఁ 'దత్త్వవిద్యాకలాపకవితాసార' 'అన్యవాదకోలాహల' 'ప్రత్యక్షభృంగీశావతార' బిరుదములు గలవని కర్ణాటకకవిచరిత్రకారులు వ్రాసిరి. ఆంధ్రగ్రంథములందు బిరుదములు గానరావు. కాని, పద్యబసవపురాణమం దీతఁడు 'జైనమస్తకవిన్యస్త శాతశూలకలిత బిజ్జలతలగుండు గండబిరుదశోభితుఁ'డని ప్రశంసింపఁబడినాఁడు.