పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

25


సోమనాథుని స్తుతించిరి. కర్ణాటకభాషలో వీరశైవకృతులు పెక్కులు గలవు. కావునఁ నందుఁ బలువురుకవు లీతనిఁ బ్రస్తుతించిరి. వీరశైవు లీతని మతప్రవర్తకులలోఁ బ్రస్తుతింతురు. ఈతఁడు భృంగీశుని యవతారమని వారినమ్మకము. ఈతఁడు బసవేశ్వరునియుఁ బండితారాధ్యునియుఁ జరిత్రముల రచించినట్లే యీతని చరిత్రమును బాల్కురికి సోమనాథపురాణ మనుపేరఁ గర్ణాటభాషలో విరక్త తొంటెదార్యుఁ డనుకవి రచియించినాఁడు. ఆతఁడు క్రీ.1560 ప్రాంతములవాఁడు.

పాల్కురికి సోమేశ్వరపురాణము - ఇందు సోమనాథుని చరిత్రమును ప్రధానముగాఁ జేసికొని సోమనాథుని సమకాలమువారగు రెంటాల మల్లినాథుఁడు, పాల్కురికి సూరామాత్యుఁడు మొదలగువారియు, నింకను బ్రాచీనులగు మఱి పెక్కురయుఁ జరిత్రములను, శివలీలలను గ్రంథకర్త వర్ణించినాఁడు. సోమనాథచరిత్ర మిందల్పముగానే కానవచ్చును. ఉన్నదాని సారమిది.

"సోమనాథుఁడు వేమనారాధ్యవంశమువాఁడు; పాల్కురికి గ్రామవాస్తవ్యుఁడు; గురులింగార్యునకు మంగళాంబకుఁబుత్రుఁడు. (ఈతఁడు దీక్షావంశమునఁ దలిదండ్రుల పేళ్లు చెప్పినాఁడు.) ఓరుఁగంటి ప్రతాపరుద్రునిచే నారాధితుం డయినాఁడు. (పిడుపర్తి బసవన చెప్పిన కథనెల్ల నీతఁడును జెప్పినాఁడు). అప్పుడు చక్రపాణి రంగనాథుఁడను వైష్ణవునితో సోమనాథునకు మతవిషయమునఁ దగవు వాటిల్లెను. అశైవుని దర్శింపఁడు గాన సోమనాథుఁడు తెరచాటుననుండి వాదముచేయ నంగీకరించెను. కాని, యా వైష్ణవుని జయించుటకు సోమనాథుని పుత్రుఁడగు చతుర్ముఖ బసవేశ్వరుఁడే తలపడెను. వారిర్వురకును గొప్పవాదము జరిగెను. రంగనాథుఁ డోడిపోయెను. పరాజయదుఃఖముతో నా రంగనాథుఁడు శ్రీశైలమార్గముననే తిరిగిపోయెను. శ్రీశైలమల్లికార్జునునిఁ జూడక ద్వేషబుద్ధితోడనే యరిగెను. ఆ శివద్వేషముచే నాతనికిఁ గన్నులు గ్రుడ్డివయ్యెను. అహోబలమున కరిగి యాతఁడు నరసింహస్వామిని బ్రార్థించెను. ఆ స్వామివలన స్వప్నమున శివాధిక్యబోధమును బడసి లజ్జితుఁడై తిరిగి శ్రీశైలమునకు వచ్చి శ్రీశైలమల్లికార్జునుని బహువిధములఁ బ్రస్తుతించెను. పదపడి పాలకురికికి వచ్చి