పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

9


సోమనాథుని కులగోత్రములు

సోమనాథుఁ డారాధ్యబ్రాహ్మణుఁడని పలువురు తలంచిరి. కాని శ్రీ బండారు తమ్మయ్యగా రితఁడు జంగముఁ (జంగమకులమువాఁ) డని వ్రాసిరి.[1]

వారి యభిప్రాయముతో నేనేకీభవింపజాలకున్నాఁడను. సోమనాథుఁడు బ్రాహ్మణుఁడే యని నేను దలంచుచున్నాఁడను. పండితారాధ్యచరిత్రము, చతుర్వేదసారము, బసవరాజీయము మొదలగు సోమనాథుని గ్రంథములను బరిశీలించినచో సోమనాథుని బ్రాహ్మణత్వము సందేహింపరానిదిగా గోచరించును. మంచి శిష్టాచారసంపత్తిగల బ్రాహ్మణునకే యెఱుకపడఁదగిన విషయములెన్నో పయిగ్రంథములందుఁగలవు. వానిలో వేదమంత్రము లుదాహృతములయినవి. వేదభాష్యము లుద్దృతములయినవి. వైశ్వదేవాదిశ్రౌతకర్మల రహస్యము లెన్నో విమర్శింపఁబడినవి. ఆనాఁ డిట్టివిషయములు బ్రాహ్మణుల కందరానివిగా నుండెడివి. పండితారాధ్యచరిత్రమున “నలిఁ బాల్కురికి సోమనాథుండనంగ, వెలయువాఁడను జతుర్వేదపారగుఁడ” అనుట యాతని బ్రాహ్మణత్వము నుద్ఘోషించుచున్నది. బ్రాహ్మణేతరుఁడు వేదమును జదువరాదనుటకుఁ బ్రమాణములను సోమనాథభాష్యమున సోమనాథుఁడే యుదాహరించియున్నాఁడు.[2]

పండితారాధ్యచరిత్ర కృతి శ్రోతయగు పాల్కురికి సూరనామాత్యుని సోమనాథుఁ డిట్లు సంబోధించుచున్నాఁడు :

“పరమపవిత్ర ! యాపస్తంబసూత్ర !
హరితసగోత్ర! విద్యాపుణ్యగాత్ర !....
మచ్చికనాముద్దుమఱఁది వీవనియు
నెచ్చెలికాఁడవు నీవె కాకనియు”

  1. ఆంధ్రపత్రిక యుగాది సంచిక, దుందుభి సంవత్సరము; పుట 144 చూచునది.
  2. ప్రసాదస్థలమాహాత్మ్యప్రకరణమునః - “అశుద్ధాత్మా శుచిర్లోభా న్మద్భుక్తం పావనం పరమ్, భక్షయ న్నాశ మాప్నోతి శూద్రో హ్యధ్యయనాదివ; శూద్రస్య వేదాధ్యయన మగ్రజాగ్రహణం తథా.” ఇత్యాదులు.