పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

184

బసవపురాణము

ఘటపటాదులలోని గగనంబునట్ల - పటికంపుశిలలోని భావంబునట్ల
వెలయ బీజములోని వృక్షంబునట్ల - నలరు శబ్దంబులోపలి యర్థమట్ల
పర్వతంబులలోని ప్రతిశబ్దమట్ల - సర్వంబునందును శర్వుండునట్ల
ముల్లు గుట్టఁదెఱపి యెల్లెడ లేక - యెల్లచోఁదానయై యిట్లున్నవాఁడు
ఈశుండు సకలలోకేశుండు గర్మ - నాశుండు నాదు రామేశుండె” యనిన
“యవునేని దాసయ్య! యఖిలంబునందు - - శివునకుఁగల్గువిశేషంబు లెవ్వి?
శివుఁడు నిత్యుండటె యవి యనిత్యములు - శివుఁడుననిత్యుండో శివుఁడందులేడొ
శివుఁడు దైవంబటె యవి యదైవములు - శివుఁడు నదైవమో శివుఁడందులేఁడొ
శివుఁడటే పశుపతి యవి వశురాశి - శివుఁడును బశువయో శివుఁడందులేఁడొ
యందొక్కటైనను హరుని గుణంబుఁ - జెందంగవలవదా యిందులో” ననిన
నన్యాయవాదుల నతగులఁజూచి - ధన్యుఁడు [1]దేడరదాసి యిట్లనియె
“నూనియగాఁజేసి నూల్కొనుదీప - మా[2]నూవులందును నలరునే చెపుఁడ
నువ్వులఁగల్గునే నూనియ గుణము - నువ్వులలోపల నూనియ లేదె
యీశునిగుణమేల నిన్నిటఁబొందు - నీశుఁడు దానెట్టు లిన్నిట లేఁడు
నువ్వులలోపల నూనియ గలదు - నువ్వులు గల్గునే నూనియలోన
సర్వజ్ఞునందును సర్వంబునుండు - సర్వజ్ఞుఁడుండునే సర్వంబునందు
నీ హేతువులకెల్ల నిట్లు చూడుండు - ఊహింపఁగా లేకయును గలవిధము
మథనపక్వక్రియామానంబునందుఁ - బ్రథితంబుగా మీఁదఁ బరము గాన్పించుఁ
గలుగంగవలెనన్నఁగలుగు జ్ఞానికిని - కలుగ దజ్ఞానికివలె నన్ననైన
సర్వజ్ఞుఁడిట్టుండు సర్వంబునందు - సర్వప్రమాణాదిసంసిద్ధ మిదియు”
ననవుడు జినమును లపహసింపుచును - మనమునఁదలపోసి మఱియు నిట్లనిరి
“పెక్కు లెఱుంగుట వెద్ద మేలయ్యె - నిక్క మింతయుఁగూడ నిటలాక్షుఁడేని
కలుగునే మలమూత్రములు విడ్చు [3]ఠావు - నిలమెట్టవచ్చునే యిది సెప్పు” మనిన
కూడజైనులనెల్లఁ గూళలఁజేసి - దౌడలు వడునట్లు దాసి యిట్లనియె
“యెఱుఁగరె జైనులా! రెన్నఁడు మీర - లెఱుఁగని కార్యమే యిది మీకుఁగ్రొత్తె
మృడుఁడు లేఁడనియెడు జడకర్మవాది - నడుతలమెట్టియే నడుతు మేప్రొద్దు
మనసిజహరుఁడు లేఁడని పల్కు నధమ - మనుజుల నోళ్లు మామర్గడంబులకుఁ
గింకిరిపడకుఁడీ బొంక నే నేర - నింక నే మడిగిన నిట్ల చెప్పెదను

  1. దేవర
  2. నూనెయం
  3. తావు