పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

91

దమతమ [1]కఖిలవాద్యంబులు మ్రోయఁ - గ్రమమొందఁ గేళికగతి నటింపుచును
వారివారికి హర్షపూరముల్గాఁగఁ - గోరి భక్తాలికింపార మ్రొక్కుచును
బాయక రేయును బవలు లింగార్చ - నాయతామృతవారియందోలలాడ
నఖిల సామ్రాజ్య సమంచిత సరస - సుఖముల కెమ్మెయి సొగయకున్నెడను
మల్లరసను నొక్క మండలేశ్వరుఁడు - దొల్లి యిట్టుల రాజ్యమొల్లక విడిచి
శ్రీగిరి కేఁగి [2]సచ్చింతాసమాధి - నాగిరి బిల్వవనాభ్యంతరమున
నున్నవారని వారియురుభక్తిగుణమ - హోన్నతికయు ధ్యానయోగసంపదయు
శివభక్తిత్త్వానుభవసమగ్రతయు - శివభక్తగణములచే వినఁబడుడు
నప్పుడు శ్రీగిరికరుదెంచి రర్థిఁ - బొప్పారు మల్లరసును జూచువేడ్క
రయ మందఁగా మాదిరాజయ్యగారు - క్రియ దులుకాడ నగ్గిరి శృంగములను
స్పాటికపర్వతబహుశృంగములను - హాటకరత్నమయాంచితాద్రులను
బాతాళగుహల నభ్రంకషశిలల - భూతలప్రచ్చన్నపురవరంబులను
స్పర్శవేదుల మణిపర్వతంబులను - దర్శనముక్తిప్రదస్థానములను
ఖగమృగనాగసంకరనివాసముల - నగణితోద్యానవనాంతరంబులను
బర్వతచూడానిపతితధారాంబు - నిర్వికల్పప్రవాహోర్వీస్థలముల
నంతంత నిలిచి యేకాంతదేశముల - సంతతలింగపూజనలు సల్పుచును
జనుదెంచి చనుదెంచి యనుపమబిల్వ - వనసమీపంబున ఘనతరంబైన
రుద్రాక్షశైలముల్ రుద్రాక్షతరులు - రుద్రాక్షగనులును రుద్రాక్షనదులు
భసితంపు గిరులును భసితంపుఁ దరులు - భసితంపు గనులును భసితంపు నదులు
లింగపర్వతములు లింగవృక్షములు - లింగాకరంబులు లింగతీర్థములు
జంగమశైలముల్ జంగమతరులు - జంగమగుల్మముల్ జంగమలతలు
సల్లాపశైలముల్ సల్లాపతరులు - సల్లాపగుల్మముల్ సల్లాపలతలు
గాయకశైలముల్ గాయకతరులు - గాయకగుల్మముల్ గాయకలతలు
గాయకమృగములు గాయకాలులును - గాయకపక్షులు గాయకఫణులు
నాట్యపర్వతములు నాట్యవృక్షములు - నాట్యగుల్మంబులు నాట్యవల్లరులు
నాట్యమృగంబులు నాట్యపక్షులును - నాట్యోరగంబులు నాట్యవానరులు
దనరు కాష్ఠజ్యోతులును దృణజ్యోతు - లును వాలుకాజ్యోతులును జ్యోతినదులు
జలపర్వతంబులు జలవృక్షములును - జలవిహంగంబులు జలమృగావలులు

  1. రఖిల
  2. నిశ్చింతా