పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

61

గతి మాకు వేఱొండు గలదె జంగమమ - గతి మనోవాక్కాయకర్మంబులందు
ఇట్టిది గురుమార్గమిది నిజవ్రతము - ఇట్టిది సారిత్రమిది లాంఛనంబు
తలఁప మా గురుసంప్రదాయంబువారు - గలరు శ్రీగిరి యాదిగా నెల్లయెడల
నధిపసాక్షాజ్జగదంబాసమాన - లధికంబు గలరు దాక్షారామమునను”
అని సమంచితవిదగ్ధాలాపములను - వినుపింప నాయయ్య విస్మితుండగుచుఁ
జెలువ పర్యంకంబు సింహాసనముగఁ - దలఁచి గంధద్రవ్యతాంబూలవితతి
యొడఁబడ నంత నొండొండు శోధించి - [1]“పడఁతర్ఘ్యపణ్యముల్ వట్టు” నావుడును
“దనరఁగ నీయయ్య మనసు వచ్చుటయుఁ - గనుఁగొన నా నేర్పుకలిమిగా” కనుచు
హసనంబు దళుకొత్త నర్ఘ్యపణ్యములు - పసిఁడిబిందెలఁ [2]బట్టి పడిగముల్వెట్టి
గ్రక్కున సకలోపకరణంబులోలి - జక్కొల్పి యమ్ముగ్ధసంగయ్య కలరఁ
గరమొప్ప గంటలుఁ గాంస్యతాళములు - నరుదొంద మ్రోయ ధూ[3]పానంతరంబు
దెఱవ యుదంచిత [4]దృగ్దీధితులను - నఱితిహారంబుల యంశుజాలములఁ
బొలుపగు కంకణస్ఫురితరోచులను - మిళితమై కన్నులు మిఱుమిట్లు [5]గొనఁగ
వెలుఁగు నీ రాజసంబులపల్లెరముల - నలర నందిచ్చునయ్యవసరంబునను

చంద్రోదయ వర్ణనము


“మలసంహరుఁడు జటామకుటంబుమీఁద - నిలిపియు నా కందు నెఱిఁబుచ్చలేఁడు
భక్తులపాదసంస్పర్శనంబునను - వ్యక్తిగా నిర్మలత్వంబుఁబొందుదును”
అని యాత్మఁ దలపోసి యరుదెంచుమాడ్కి - వనజారి ప్రాఙ్ముఖంబున నుదయించె
బసవని సితకీర్తి వర్వెనా, శివుని - భసితాగరాగప్రభలు వర్వె నాఁగ,
నా రుద్రునట్టహాసాంశులు దనరె - నా, రజతాచలచారుదీధితులు
విలసిల్లెనా, నభోవీథి నెల్లెడల - నెలకొని యచ్చవెన్నెల వెల్లి [6]విరియ
నక్కాంత ముగ్ధసంగయ్యకుఁ బ్రీతి - నెక్కొని యాత్మలో నివ్వటిలంగ
ననయంబు లింగపూజనల నటించు - తనదు విలాసినీజనుల రావించి[7]
యక్కమహాదేవి! యల్ల మద్దెలలు - జక్కొల్పి వేగంబ సంధించుకొనుఁడు (ము)
[8]స్వరమానమున బసవప్రమథవ్వ! - కరమర్థిఁ బట్టఁడు(ము?) కాహళ లోలి;

  1. పడఁతియర్ఘమ్ములు
  2. నించి
  3. పాంతంబునందు
  4. దృగ్విదీధితుల
  5. వోవ
  6. చూప
  7. ఈ పాదమునకుఁ దర్వాత “జవనికఁ బట్టింప సరసమై నిలిచి- కవళవ్వ పూర్వరంగము ప్రసంగించు” ఒక్క ప్రతిలోనున్నది
  8. స్వరమాన మెఱిఁగి బసవప్రమథవ్వ