పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

3

నాదివేదాంతసిద్ధాంతపురాణ - వేదశాస్త్రాగమవిహితమార్గములఁ
దను మనోధన నివేదన సమగ్రత[1]ను - బనుగొని జంగమార్చనలు సేయుచును
[2]శీలంబు దనర సీమాలంఘనవ్ర- తాలంకృతిని బేర్చి యాచారలీల
యసలారఁగాఁ గుమారాద్రికిఁ దూర్పు- దెసను సోపానముల్ దీర్చి పొల్పార
మహితసద్భక్తి సమంచితవృత్తి - మహిఁజను రెంటాల మల్లినాథుఁడును;
నిరతిశయప్రీతి నిత్యంబు నైదు - కరవీరపుష్పముల్ హరునకర్పింప
నొక్కనాఁడొకఁడందుఁదక్కువయైనఁ- గ్రక్కునఁదననేత్రకమలమర్పించి
భవునిచే [3]నసదృశాంబక మప్డ పడసి- ధ్రువకీర్తిఁ బేర్కొన్న దోచమాంబయును;
ధీరుండు మున్నయదేవయోగీశు - కూరిమి శిష్యుఁడు నారయాంకునకుఁ
బుత్త్రుండుఁ బరమపవిత్రుండు విమల - గాత్రాంచితుఁడు నీలకంఠాగ్రజుండు
జగదభినుతుఁడు ప్రసాదావధాని - [4]నిగమార్ధవేత్త [5]గోడగి త్రిపురారి;
లోనుగా సకలభక్తానీక మెలమి- మానితభక్తిసామ్రాజ్యసంపదలు
[6]సిలివిలివోవంగఁ జిరతరమహిమ - నలరారుచుండంగ [7]నందొక్కనాఁడు
మండితాసంఖ్యాతమాహేశ్వరులకు - దండప్రమాణంబు దగనాచరించి
భక్తదయారసపరమామృతాభి - షిక్తుండ నగుచు గోష్ఠీప్రసంగతిని
“నసదృశంబై యొప్పు బసవపురాణ - మెసకంబుతోఁ జెప్ప నిష్టమయ్యె[8]డిని
వరకథాసూత్రంబు [9]వెరవెఱిఁగించి - చరితార్థుఁ జేయరే కరుణతో” ననుచు
సన్నుతి సేయుచు సస్పృహత్వమున- విన్నవించు[10]డు భక్తవితతి హర్షించి
సముదితప్రీతిఁబ్రసాదావలోక - నము నివ్వటిల్లంగ నన్ను వీక్షించి
“బసవపురాణంబుఁ [11]బసరించుశక్తి- నసలార నొసఁగితి మట్లు గావునను
రచియింపు బసవపురాణంబు నీవు - నచలితభక్తహితార్థంబు గాఁగ”
నావుడు భక్తజనావలియాజ్ఞ - వావిరిఁదలమోచి వర్ణింతుఁగవిత.
పాటింపఁదగిన కర్ణాటభూమికిని - గోటీరమై యొప్పుగొబ్బూరనంగ
నా యగ్రహారమహాజనోత్తమ ని- కాయపూజిత పాదకమలద్వయుండు

  1. యుఁ బనుగొన
  2. ఓలిమై గ్రామ
  3. నసదృశంబవు కనున్నవడసి
  4. నిగమాంత
  5. ఈతఁడే యనుభవసారకృతిపతి.
  6. జిలిబిలి. వినుకలి సుఖము సిల్విలివోవునంత - పండి-4ప్రక.
  7. నట్లొక్క
  8. డును
  9. వెరవెఱుఁగించి, ఇట్లు కొన్ని చోట్లఁగలదు.
  10. ఇట్టిచోట్లఁగూడఁ గొన్నిప్రతులలో నర్ధానుస్వారము కానవచ్చును. కాని పెక్కుప్రతులలో లేకపోవుటచేతను, బూర్ణానుస్వారరూప మెక్కడను గానరాకుండటచేతను, దాని నిక్కడఁ జేర్పలేదు.
  11. బచరించు శక్తి