పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

బసవపురాణము

శాంభవ [1]వేధదీక్షాసద్విశేష - సంభావితాశ్రితజనసముత్కరుఁడు
సురుచిరప్రణవవిస్ఫురితోపదేశ - చరితార్థ నిఖిలశిష్యప్రతానుండు
కింకర నిచయహృత్పంకేరుహాంత - రాంకిత వరసచ్చిదానందమూర్తి
పాత్రుండు భవలతాదాత్రుండు విషయ - జైత్రుండు విమలచరిత్రుండు సకల
భువనపావనమూర్తి బుధచక్రవర్తి - ప్రవిమలకీర్తి సద్భక్తిప్రపూర్తి
యని వినుతింపగ నాశ్చర్యమహిమ - మనుచుండు మండెంగమాదిరాజనఁగ;
నా మాహాత్ముని సముద్యత్కృపాపూరి - తామృతహస్తకృతావతారుండు
నా గురుదేవు పాదాబ్ద సౌరభ్య - భోగలీలా వరపుష్పంధయుండు
నా శివయోగి యుదాత్తమూర్తి ప్ర - కాశితహృత్పద్మకర్ణికాంతరుఁడు
నా దివ్యదేహు దయాకలిత ప్ర - సాదపాదోదకాస్వాదతత్పరుఁడు
గురు పరతంత్రుండు గొబ్బూరి విభుఁడుఁ - బరమ శివాచారపథవర్తనుండు
లింగైక్యనిష్ఠావిలీనమానసుఁడు - సంగనామాత్యుండు జగదుపకారి
యని యిట్లు భక్తసభాభ్యంతరాళ - మున నిన్నుఁజెప్పంగ విని లసత్ప్రీతి
వసరింప జంగమభక్తుండ వనియు - బసవపురాణైకపాత్రుండ వనియు
నచలితప్రీతి మా [2]కనుగులంబనియు - రచియింతు సవపురాణసత్కవిత
యవధానవంతుండవై నెమ్మి వినుము - సవిశేషభక్తిమై సంగనామాత్య!
ధర “నుమా మాతా పితా రుద్ర” [3]యనెడు- వరపురాణోక్త నీశ్వరకులజుండ
శరణ[4]గణాశ్రయ సకలస్వరూప - గురులింగ [5]వరకరోదరజనితుండ
భక్తకారుణ్యాభిషిక్తుండఁ [6]బాశ - ముక్తుండఁగేవల భక్తిగోత్రుండ
భ్రాజిష్ణుఁడగు విష్ణురామిదేవుండుఁ - దేజిష్ణు వగు శ్రియాదేవి యమ్మయును
గారవింపఁగ నొప్పు గాదిలిసుతుఁడ - వీరమాహేశ్వరాచారవ్రతుండ
ఖ్యాత సద్భక్తిమైఁగల కట్టకూరి - పోతి [7]దేవరపదాంబుజషట్పదుండ
సకృపాత్ముఁడగు కర[8]స్థలి విశ్వనాథు - ప్రకటవరప్రసాదకవిత్వయుతుఁడ
[9]వడగాము రామేశువరశిష్యుఁ డనఁగఁ - బడు చెన్నరాముని ప్రాణసఖుండ
సంభావితుఁడ భవిజనసమాదరణ - సంభాషణాది సంసర్గ [10]దూరగుఁడ
నలిఁబాల్కురికి సోమనాథుఁడనంగ - వెలసినవాఁడ నిర్మలచరిత్రుండ

  1. వేద
  2. కనుగలం
  3. యనఁగఁ బరగువేదోక్తి
  4. జనా
  5. 'జంగమవర కుమారుండ' అని యొక ప్రతి
  6. బాప
  7. దేవుని
  8. స్థలము విశ్వేశు
  9. వడుగాము, వడుగామి
  10. వర్జితుఁడ