పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

బసవపురాణము

[1]బసవచరిత్ర మివ్వసుమతి[2]మీఁదఁ - బసరింతుఁ దత్కథాప్రౌఢి యెట్లనిన:
[3]శ్రీమన్మహాదేవుసింహాసనంబు - హైమవతీశువిహారస్థలంబు
హరునిభక్తులకు నేకాంతవాసంబు - పరమయోగులకు హృత్ప్రమదావహంబు
నరులకుఁగర్మసంహరణైక హేతు - వరయంగ సురలకు [4]నాశ్రయభూమి
సకలతీర్థములకు జనయిత్రి యగుచుఁ - బ్రకటింప నొప్పు శ్రీపర్వతేంద్రంబు;
ఉర్విఁ దత్పర్వతసార్వభౌమునకుఁ - బూర్వవక్త్రాంకవిస్ఫురణ [5]దుల్కాడ
నొలసి కుమారశైలోత్తంసలీలఁ - దిలకించి పెంపారుఁ ద్రిపురాంతకంబు;
తత్రిపురాంతకస్థానవాస్తవ్యుఁ - డై త్రిపురాంతకుం డభినుతిఁ బేర్చు;
నాపురసంహారు నపరావతార - రూపితఖ్యాతినిరూఢిఁ దలిర్చు
నాసదాశివమూర్తి య[6]వికలైశ్వర్య - భాసురచరలింగపటుదీప్తిఁబరగు
నాకాలకంధరు ననవద్యహృద్య - సాకారవిభ్రమవ్యాప్తిఁ బెంపారు
నా దేవువీర వ్రతాచారసార - మేదురస్ఫురణమై మించి వెలుంగు
జంగమరత్నంబు శరణసమ్మతుఁడు - లింగైక్యవర్తి గతాంగవికారి
పండితారాధ్య కృపాసముద్గతుఁడు - మండితసద్భక్తిమార్గప్రచారి
విలసితపరమ సంవిత్సుఖాంభోధి - నలిఁ గరస్థలి సోమనాథయ్యగారు;
బసవని కారుణ్యరససుధావార్ధి - నసదృశలీల నోలాడుచు నిత్య
నియమవ్రతాచారనిరుపమనిష్ఠ - క్రియగొనఁదత్త్వనిర్ణయము సంధిల్ల
నతులగోష్ఠీసుఖస్థితిఁ బేర్చుభక్తి - మతినియమంబుల మల్లినాథుఁడును;

  1. కొన్ని శాసనములందును, వ్రాఁతలందును 'బసువ'పదము కలదు. బసవపురాణము పండితారాధ్యచరిత్రము మొదలగు గ్రంథముల వ్రాఁతప్రతులలో రెండురూపములును గానవచ్చుచున్నవి. కాని, సోమనాథుడీ బసవపురాణమునను బండితారాధ్యచరిత్రమునను యతిస్థలమున బసవపదమునే ప్రయోగించెను. “శరణోపకార బసవపురాణార్థ-వరభుక్తిముక్తిసంవర్ధన చరిత” (7వ యాశ్వాసము తుద. బసవపురాణము). “చరితంబులును శ్రీబసవపురాణంబు - చాతుర్య మొసఁగ బసవదండనాథు గీతంబు” (పండితా. అయిదవ ప్రకరణము. 61-62 పుటలు) ఈతఁడే సోమనాథభాష్యమున బసవ, బసువ, పదములు రెండును సాధువులే యనియుఁ జెప్పినాఁడు. “-వృషభస్య బసవనామకత్వం కస్మా త్కారణా దాసీదితి. వృకారస్య బకారాదేశో భవతి. వబయో రభేద ఇతి. 'శషోస్స' ఇతి సూత్రాత్ ష కారస్య సకారాదేశో భవతి. వః పవర్గతేతివారరుచ్య సూత్రాత్ బ (భ-అనియుండవలెను) కారస్య వకారాదేశో; భవతి, ఏతద్వృషభాక్షరతద్భవాత్ “బసవ” ఇతి నామ వక్ష్యతే. సాక్షాద్వృషభేశావతార ఇత్యర్థః. పశూన్ పాతీతి పశుపః, వృషభః, తత్పశుప (పే) త్యక్షరత్రయతద్భవాత్ బస(సు అని యుండవలెను) వ ఇత్యక్షరత్రయం సంభవతి”— సోమనాథభాష్యము రెండవపుట.
  2. లోన
  3. శ్రీమహాదేవుని
  4. నాశ్రమ
  5. దొల్కాడ
  6. వితధైశ్వర్య