పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xi


గురుఁడు లింగంబని గుఱుతుగా నెఱిఁగి - యరయ లింగమ గురుండనియు నెఱింగి
గరిమ జంగమము లింగంబుగా నెఱిఁగి - మరలి లింగము జంగమంబుగా నెఱిఁగి
చనుజంగమము గురుస్వామిగా నెఱిఁగి- ఘనగురువరుని జంగమముగా నెఱిఁగి
యొకరొకరొక రందు నుండుట నెఱిఁగి- యొకరీతి మువ్వురు నొకటిగా నెఱిఁగి
యిట్టివిజ్ఞానమహిష్ఠుఁడై మనసు - ముట్టి మూర్తిత్రయంబును భజింపుచును
బరమసదానంద భరితాత్ముఁడగుచు-నరుదైన గురుకరుణాబ్ధిఁ దేలుచును

-దీక్షాబోధ 74-పుట.

జీవయాత్ర

జీవయాత్రకుఁ బరమప్రయోజనము బ్రహ్మానందమయమైన విశ్వకల్యాణము. జీవుఁడు జీవయాత్రను జేయుటకు విశ్వమంతయును విశ్వేశ్వరజీవవిశ్వభావములను, జ్ఞేయజ్ఞాతృజ్ఞానభావములను, కార్యకర్తృకారణభావములను, గురులింగజంగమరూపములను, సాధ్యసాధకసాధనభావములను సంభవమగుచున్నది. అవ్యక్తమైన పరమాత్మకును, వ్యక్తమైన విశ్వమునకును వ్యక్తావ్యక్తమైన జీవునియందు ధర్మప్రతిష్ఠ కలుగుచున్నది. జీవుఁడు సహజముగ వ్యక్తమైన విశ్వమునందు దేహభ్రాంతిని బొంది సుఖప్రాప్తికి దూరస్థుఁ డగుచున్నాఁడు. అవ్యక్తమును గనుగొనుటకు సాధనంబై నవ్యక్తము స్వయముగను ప్రతిబంధక మగుచున్నది. జీవయాత్రయందు వ్యక్తావ్యక్తముల పరిజ్ఞానము మతములకు, ధర్మములకు, కర్మలకు, సాహిత్యములకు, కళలకు, శాస్త్రములకుఁ బరమఫలము. అవతారమూర్తులు, మహర్షులు, తత్త్వజ్ఞులు, జ్ఞానులు, యోగులు, త్యాగులు, శాస్త్రజ్ఞులు, ధర్మజ్ఞులు, కర్మజ్ఞులు, భక్తులు జీవయాత్రాఫలమును సాధించుటకుఁ జేసిన తపఃఫలమును బ్రబంచవిజ్ఞాన మనంతముగ బోధించుచున్నది. నిగమాగమములు, దర్శనములు, గీతలు, ధర్మశాస్త్రములు, పురాణములు, కావ్యములు, నాటకములు, కళలు సువ్యక్తము చేయుచున్న ఈ యనంతవిజ్ఞానము జీవయాత్రకు సాధనంబైనను, జనసామాన్యంబునకు దుర్గ్రాహ్యముగ నున్నది. జీవక్షేత్రమునందు వ్యక్తావ్యక్తములకు ధర్మప్రతిష్ఠను సమకూర్చుటకు భగవద్భక్తి పరమసాధనముగనున్నది. జీవయాత్రను, దేవయాత్రను జేయగలవిధమును వైదికమతధర్మము లనంతవిధములను నిర్దేశించుచున్నవి.