పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xii

 దేహధారులకవ్యక్తమును గ్రహించుట దుస్తరము. అవ్యక్తము వ్యక్తముద్వారా గ్రాహ్యమగుచున్నది:

శ్లో. క్లేశో౽ ధికరతర స్తేషా మవ్యక్తాసక్తచేతసామ్,
    అవ్యక్తా హి గతి ర్దుఃఖం దేహవద్భి రవాప్యతే.

జీవయాత్రను, విషయయాత్రను జేయక శివయాత్రను జేయుటకు సర్వకాల సర్వావస్థలయందును శివసందర్శన, సంస్మరణ, సంకీర్తనములు సాధనములుగ నున్నవి. జీవయాత్రను శివయాత్రను జేయుటకు జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు గురులింగజంగమార్చనలందు భక్తిపరవశములు కావలయును. జీవయాత్రను దేహయాత్రార్థము గాక ఆత్మయాత్రార్థము చేయవలసినవిధమును సాధకునకు వీరశైవము వివరము చేయుచున్నది.

సాధకుఁడు

మానవశరీరమద్భుతమైన నిర్మాణము. ఆ నిర్మాణమునందలి కీలులను గనుఁగొనుటకు మహానుభావులు సమర్థులు. దేహేంద్రియాదుల కీలులను ప్రకృతిశాస్త్రజ్ఞులు నిర్ణయించినను అతీంద్రియరహస్యములను నిర్ణయించుటకు మహాయోగులు సమర్థులు. తత్త్వజ్ఞులు దేహమునందుఁగల తత్త్వములను భిన్నవిధములను నిర్ణయించుచున్నారు. సాంఖ్యులు, యోగులు 5 తత్త్వములను, వీరశైవులు 36 తత్త్వములను నిర్ణయించుచున్నారు. సృష్టిక్రమమునం దనులోమవిధాన మాకాశజన్యమైన శబ్దముతో నారంభమగుచున్నది. పంచభూతములు, స్థూలసూక్ష్మములు పది, దశేంద్రియములు, మనోబుద్దిచిత్తాహంకారములు, జీవుఁడు ఇరువదియైదు తత్త్వములు. స్థూలమైన శబ్దమునకు నాదము లింగరూపము. అవ్యక్తమున కాదిమవ్యక్తస్వరూపము నాదము. ఆ నాద మంతర్లింగరూపమున విశ్వమునం దంతటను విలసిల్లుచున్నది. మానవదేహమున సహస్రారమునందు దేదీప్యమానముగ విరాజిల్లుచున్నది. బుద్ధ, క్రీస్తు, కృష్ణావతారములం దీ దివ్యతేజమును భక్తులు సందర్శించి చిత్రించిరి. సకలమానవులయందును దేదీప్యమానమగు తేజము ప్రక్షిప్తముగ నున్నది. నాదసంజాతమైన లింగశరీరము సకలదేహాంతర్యామియై జీవయాత్రను