పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

x


మహాప్రయత్నములను వీరశైవమత చరిత్రము విశదముచేయుచున్నది. వీరశైవమతమునకు నేఁటికినిగల ప్రాబల్యమును గర్ణాటకదేశమునందుఁగల వీరశైవమఠములు విశదము చేయుచున్నది. వీరశైవమఠాధిపతు లితరమఠాధిపతులవలె సకలగౌరవములను బొందుచున్నారు. వీరశైవము తలపెట్టిన కులావరణనిర్మూలనము దుస్తరమైనది. లింగాయతులు, జంగములు, సాలెలు, జాండ్రలు ప్రత్యేకకులమువారై, మరికొన్ని కులము లేర్పడినవి. వైదికధర్మ ప్రాబల్యము తిరిగి తలయెత్తినది. భక్తిప్రధానమైన వీరశైవము నిర్జీవమైన యాచారసాంప్రదాయబద్దమై సాంఘికప్రయోజనములకును, మానవకల్యాణమునకును నిరుపయోగమైనది.

వీరశైవతత్త్వము

వీరశైవతత్త్వార్థము నిగూఢముగ నున్నది. వీరశైవమునకు బాహ్యమునందువలె అంతరంగమునందును లింగధారణము బీజముగ నున్నది. వైదికమతమునందలి దేవతార్చనము, వేదాంతమునందలి తత్త్వార్థము, జైనబౌద్ధమతములందలి సంఘారాధనము, వివిధమతములందలి కర్మారాధనము వీరశైవభక్తియందు సంయోగమును బొందినవి. లింగార్చనము, లింగైక్యము, జంగమభక్తి, వీరదీక్ష వీరశైవమునందు సంయోగమును బొందినవి. వీరశైవులు జైనబౌద్ధమతములను ఖండించి ఆ మతస్థులను హింసించినను, ఆ మతధర్మములు వీరశైవమునందుఁ బ్రతిష్ఠను బడసినవి. బౌద్ధమతమునకు మూలస్కంధములైన, "1.బుద్ధం శరణం గచ్ఛ, 2. ధర్మం శరణం గచ్ఛ, 3. సంఘం శరణం గచ్ఛ” యను మూఁడు ధర్మములును గురులింగ, జంగమ, శరణు రూపములను దాల్చినవి. ఏతద్ధర్మానుష్ఠానము వ్యక్తి కైవల్యమునకును, మానవకల్యాణమునకును సాధనంబుగ నున్నవిధమును నిగమాగమాచారములు తెల్లముచేయుచున్నవి. వీరశైవులు జాతికులభేదములు లేక జంగమ, లింగములకు శరణాగతు లగుచుందురు.

గురులింగజంగమాకుంఠితభక్తి - యరిదిసుజ్ఞానంబు నా ప్రసాదములు
నలిఁగరణములుఁ బ్రాణంబులు నగుదుఁ - దలఁపంగ దేహచైతన్యము లగుచుఁ
గ్రమమున నెలకొన్నఁ గడుసంతసిల్లి - భ్రమలేకపొడమిన ప్రజ్ఞచేనంత