పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

135


వీపు, చీకటి, తీగ. తూగాడు నిరనుస్వారముగాఁ బ్రయోగించిరి. ఇటీవలివారు సానుస్వారముగాఁ బ్రయోగించుచున్నారు. 'నాడు' దేశార్థమునఁగూడ శాసనములందు సానుస్వారముగాఁ గానవచ్చును. నూఱు మీఁది యౌపవిభక్తిక మగు నూటిలో శ్రీనాథుని శాసనమునను, మఱిపెక్కింటను ననుస్వారము గానవచ్చును. 'ఏటికి' నిరనుస్వారముగాఁ గొందఱును సానుస్వారముగాఁ గొందఱును బ్రయోగించిరి. పు. 15 నాఁటు (పుట్ నోట్ చూ.) దీర్ఘముల మీఁది యౌపవిభక్తిక టకారములకుఁ బూర్వమర్ధానుస్వారము పెక్కు వ్రాఁతలందుఁ గానవచ్చును. 'గోచి' కి నిరుదెరఁగుల వ్రాఁతలుండును. తొరుగు సానుస్వారమని శ. ర. లోఁగలదు. అట్లనుటకుఁ బ్రమాణము నాకుఁగానరాలేదు. అది నిరనుస్వారమే యని నా తలఁపు. 'మావిడి' సానుస్వారముగా బహుశాసనము లందుఁ గానవచ్చును. “మా విణ్డి' అని కూడ నున్నది. ఎనుబది, ఐదు, శబ్దములలో ననుస్వారముండు ననుకొనెదను. 'మాదిఁగ' లో ననుస్వారము గలదు. అది మాతంగశబ్దభవము. 'లింగులుగాక మాదింగలున్నారే' - పండితా. 'తూపు'లో ననుస్వారము గలదని కొందఱందురు. భారతమున నది నిరనుస్వారముగాఁ బ్రయుక్తము. 'కోపించి మూఁడుబల్ దూపుల' కర్ణపర్వము. అఁట, అంట, రూపములు గలవని చిన్నయసూరి ప్రభృతులందురుగాని ప్రాచీన కృతులలో 'అంట' రూపమే కానరాదు. 'అట' లో సున్నయుఁగానరాదు. అట, అటె, అట్టె, అనియే ప్రాచీన ప్రయోగములు. 'పోతు' హరివంశమున నెఱ్ఱప్రెగడ నిరనుస్వారముగాఁ బ్రయోగించెను. కొన్ని వ్రాఁతలలో సానుస్వారముగాఁ గానవచ్చును. కొన్ని యువర్ణాంతధాతువులకు భావార్థమున సానుస్వారమయిన 'త' వచ్చుటచే (చేఁత, రోఁత ఇత్యాదులు) తత్సదృశమయిన (చేతులు, గోతులు, పోతులు మొదలగు) శబ్దములకుఁ గూడఁ బరిజ్ఞానములేని లేఖకులనుస్వారముల నుంచుచు వచ్చిరి. అట్లే యనుడు, నావుడు, ఆరగించుడు మొదలగు శబ్దములందుఁ గొన్ని తాటాకు ప్రతులలో ననుస్వారములు గానవచ్చును. రాముఁడు, బాలుఁడు మొదలగు శబ్దములకుంచినట్లే యపరిజ్ఞానముచే లేఖకులట్లు వానికిని సున్నఁజేర్చి యుందురు. వానిని జూచి కొందఱవి సానుస్వారములే యనుచున్నారు. అది సమ్మతముగాదు.