పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

133

శత్రర్థకములు :- పు.7 'వీక్షింపుచున్న, ఇత్యాదులు. ప్రాఁతవ్రాఁత ప్రతులందన్నింట శత్రర్థమగు 'చున్' పరమగునపుడు ఇంచు, ఇంపుగా మాఱుట సర్వత్ర గానవచ్చుచున్నది. ఈ బసవపురాణము ప్రతులన్నింటను నిట్టిరూపములే కానవచ్చుచున్నవి. కొందఱు వ్యాకరణకర్త లీ రూపములఁగూడఁ బరిగణించిరి; కొందఱు సరి కాదనిరి. వ్రాతఁప్రతులందు వందలకొలఁది పట్టులందున్న 'యింపు' రూపములను, మార్ప సాహసింప నయితిని. కాని, యతి ప్రాసములలో నీ రూపములు ప్రాచీన గ్రంథములందు నాకుఁ గానరాలేదు. ఈ బసవపురాణమున పు 236 'శుభకార్య మాచరించుచు నొక్కనాఁడు, పు. 52 అంచు వెండియుఁ బ్రస్తుతించుచు- ఇత్యాదులు 'ఇంపు' రాని ప్రయోగములున్నవి. ప్రాఁతవ్రాఁత లన్నింట నుండుటచే నుంచితినిగాని యీ 'యింపు' సోమనాథునికి సమ్మతమే యనఁజాలను.

అర్ధానుస్వారములు :- తిక్కనాదుల కాలమునఁగూడ నర్దానుస్వార పరిజ్ఞానమస్పష్టముగా నున్నట్టే కానవచ్చును. ఒకరు సానుస్వారముగాఁ దలఁచిన దానిని వేరొకరు నిరనుస్వారముగాఁ దలఁచుటే దీనికిఁ దార్కాణము. 'ప్రోక'ను నన్నిచోడఁడు నిరనుస్వారముగాఁ బ్రయోగించెను.

క. కోకనదంబులు మొగుడం
   గోకంబులు విరిసి దెసలకుం జన మెఱుఁగై
   ప్రోకలుగొని మౌక్తికనిక
   రాకరమనఁ దారలెసఁగె నంబరవీథిన్

- అష్టమాశ్వాసము

శబ్దరత్నాకరమున నిది నిరనుస్వారముగానే గ్రహింపఁబడినది గాని లక్ష్యము సానుస్వార మనఁదగినదిగా నున్నది. (చూ:శ.ర.) మఱియు భాస్కర రామాయణ యుద్ధకాండమున 'ప్రాఁకుదుమా' 'ఊఁకున- మ్రాకుఁలు,-ప్రోఁకలు' అని సానుస్వారముగా గ్రహింపఁబడినది. మన సోమనాథుఁడును,

పు. 144 - 'మ్రోఁకు వెంటన యెడతాఁకుచుఁజుట్టి | ప్రోఁకగాఁ బోయుచుఁ బొద్దులు వుచ్చ'