పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

బసవపురాణము


నుంచినాఁడు. ఈ దోషము నన్నిచోడని కుమారసంభవమునఁ గూడఁ బెక్కుచోట్లఁ గలదు. 'దళితాంభోరుహ సప్తపత్ర సుమహత్కాశాసనౌఘంబు' (-షష్ఠాశ్వాసము) ఇత్యాదులు.

పు. 37 - 'వచ్చు వహిత్రంబు వడువునుబోలె' 'వఱలఁగఁదాల్చిన తెఱఁగును బోలె'. నన్నిచోడఁ డిట్టివానిని దఱచుగాఁ బ్రయోగించినాఁడు. 'బలసికొలువున్న సురగిరిభంగివోలె', 'వనముగాపు వచ్చు వడువువోలె.'

పు. 84 - ఊరకో నాయన్న యూరకో తండ్రి' 'ఊరకుండు' అని ప్రయుక్తమగు శబ్దపల్లవధాతువునకు “ఊరకొను' అని యేకధాతురూపము క్రొత్తగా నున్నది. ఇట్టి ధాతువు నేఁడు వ్యవహారమునఁ గూడ వినవచ్చుచున్నది.

ఇల్ల :- పు. 23- 'ఇల్లకప్పడిసంగమేశ్వరంబందు.” పిడుపర్తి బసవన పద్యకృతిలో దీనిని 'ఇల్లీ కప్పడి సంగమేశ్వరమునం' దని మార్చినాఁడు. ఆ స్థలమునకుఁ గప్పడిసంగమేశ్వరమని పేరు. తెలుఁగులో 'ఇల్ల' పద మిక్కడనే కాని, యితరత్ర ఇల్ల, ఇల్లది, ఇల్లెక్కడ మొదలగు ప్రయోగములు గలవు గాని, వానిని వ్యాకర్తలామ్రేడితమున వచ్చిన యాదేశరూపములఁగా ననుగ్రహించిరి. అల్లి, ఇల్లి, ఉల్లి, ఎల్లి పదములు స్థల విశేషవాచక సర్వనామపదములని కర్ణాటవ్యాకర్తలు పేర్కొనిరి. తెలుఁగునఁగూడ నీ పదములు గలవు. అల్లది, అల్లవాఁడు మొదలగు విధముల నామ్రేడితమున వచ్చిన యాదేశరూపము లని సరిపుచ్చుకొనఁదగిన స్థలములోఁ గాక 'అల్ల'కు స్వతంత్ర ప్రయోగములు గూడఁ వెలుగునఁగలవు. పు. 175- 'దివి నల్లవోయెడు దేవదేవేశు' ఇత్యాదులు. 'అల్ల' తత్రార్థకము ; ఇల్ల', అత్రార్థకము; 'ఉల్ల' సమీపప్రదేశార్థకము; ఎల్ల' కుత్రార్థకము. ఇక్కడ ప్రయుక్తమయిన 'ఇల్ల' 'ఇక్కడున్న 'చేరువగానున్న', యను నర్థము గలది. ఇది యామ్రేడితమున వచ్చిన యాదేశరూపముగాదు. 'ఉల్ల'కుఁ గూడఁ బ్రాచీన ప్రయోగములు గలవు. ఉల్ల తెల్లని తురగోత్తము వాలంబు' - నన్నయ, ఆదిపర్వము. 'ఉల్ల కాంచన రథముపై నున్న వాఁడు', 'దానికుల్ల తెరువు' - అరణ్యపర్వము. 'ఎల్ల' సర్వార్థకము కలదుగాని, కుత్రార్థకము తెలుఁగున మృగ్యము.