పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

బసవపురాణము


జగదేవ దండనాయకుఁడు :- ఈతఁడే బసవేశ్వరుని నిదేశము చొప్పున బిజ్జలుని సంహరించినవాఁడు. మల్లయ్య, బ్రహ్మయ్య యను వారిర్వురీతనికిఁ దోడయిరి.

అనుమకొండ రాజధానిని జయింప సైన్యసమేతుఁడై వచ్చి యరికట్టి కాకతి ప్రోలరాజు ప్రతాపప్రదీప్తి ముందు నిలువనేరక క్షణములో జగద్దేవుఁ డొకఁ డోడి పాఱెనని యనుమకొండ శాసనము చెప్పుచున్నది. ఆ జగద్దేవుఁడు పట్టిపొంబుచ్చపురాధీశుఁడని, సంతానరాజులలో నొక్కడని, మహామండలేశ్వరుఁ డని, క్రీ. 1149 లో నాతఁడు కుందూరుగ్రామము దానము చేసినట్లు శాసనము గలదని, యాంధ్రుల చరిత్రము చెప్పుచున్నది. బిజ్జలునిఁ జంపిన జగదేవుఁ డీతఁడు కావచ్చును.

ప్రాచీన భక్తులు

బసవపురాణమునఁ బ్రస్తుతులయిన ప్రాచీనభక్తులలోఁ బెక్కు 'రఱువత్తుమూర్' అను పేర నఱవమునఁ బ్రఖ్యాతులయిన యఱువది మూగురు భక్తుల లోనివారు. ద్రవిడమున వారికి 'నయనార్ల'ని పేరు. నైనార్లు, నాయనార్లు అని కూడఁ దెలుఁగునఁ గలదు. అఱువదిమూవురలో బసవపురాణమునఁ గొందఱును, పండితారాధ్యచరితమున మఱికొందఱును బ్రస్తుతులయిరి. కాని, యానుపూర్వితో వారినెల్లరును సోమనాథుఁడు స్తుతింపలేదు.

అఱువదిమూవుర పేళ్లను మన సోమనాథుఁడు పండితారాధ్యచరిత్రము చతుర్థప్రకరణమున సహస్రగణనామసంఖ్యానమున నిట్లు పేర్కొన్నాఁడు :

తిరునీలకంఠుండు తిరునీలనక్క
తిరుమూలదేవుండు తిరునాళ్లపోవ
మానకంజారుండు మంగయక్కరసు
ఆనయనార్ మొన్నయధరుండు పిట్ట
నంగ రోహిణి పిళ్లనయనారు నంగ
సంగచండుండు పూసలనయనారు