పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

ప్రపంచ చరిత్ర


గుట తటస్థించవచ్చును. మనకు సంస్కృతిగాని, నాగరీకముగాని లేనట్లు మెలగుదుము. కుటుంబముకన్న పెద్దదగు సంఘమునందు సరిగా ఈ విధముగానే జరుగుచున్నది - మన పొరుగువారైనను అంతే. ఏక నగరవాసులైనను అంతే. మన దేశస్థులైనను అంతే. ఇతర దేశస్థులైనను అంతే. జనసంఖ్య పెరుగుటవల్ల సాంఘిక జీవనము అధికముగా గడప వలసి వచ్చినది. నిగ్రహముతో ఇతరుల కష్టసుఖము లోలోచించి మెలగ వలసివచ్చినది. సంస్కృతి. నాగరీకము అన నేమో నిర్వచించుట కష్టము. నేను నిర్వచించ ప్రయత్నించను. ఆత్మనిగ్రహము లేక ఇతరుల కష్టసుఖములను పాటించనివాడు. సంస్కృతిలేనివాడని నిష్కర్షగా చెప్పవచ్చును.


14

క్రీస్తుకు పూర్వము ఆరవ శతాబ్ది : మతము

జనవరి 20, 1931

చరిత్రయొక్క దీర్ఘ ఘంటాపథమును బట్టి పోవుదము. మనమొక మైలురాయి చేరుకొన్నాము, 2500 సంవత్సరములకు పూర్వము, ఇంకొకవిధముగా చెప్పవలసివచ్చిన, క్రీస్తుకు పూర్వము సుమారు 600 సంవత్సరములు. ఇది సరియైన తేదీయని భావింపకుము, ఇంచుమించుగా ఒక కాలనిర్దేశమును మాత్రము చేయుచున్నాను. ఈకాల ప్రాంతమున గొప్పపురుషు లనేకులుండిరి; గొప్ప తత్వజ్ఞులు, మత స్థాపకులు వివిధ దేశములలో, చీనా, ఇండియాలు మొదలు పరిషియా, గ్రీసుల వరకు ఉండిరి. వీరందరును సరిగా ఒకేకాలమున లేరు. సమీప కాలములలో వారుండుటచే క్రీస్తు పూర్వము ఆరవ శతాబ్ది ప్రసిద్ధిగన్న కాలఖండమైనది. అప్పుడు ప్రపంచమున భావతరంగ మొక్కటి - నాటి పరిస్థితులలో అసంతృప్తి, పరిస్థితులు బాగుపడునను ఆశ, కోరిక ఆవరించి యుండవచ్చును .