పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తుకు పూర్వము ఆరవ శతాబ్ది : మతము

83


మతస్థాపకులు పరిస్థితులు చక్కబరచుటకును, ప్రజలను సత్పథమున బెట్టి వారిక్లేశములను తగ్గించుటకును ఎప్పుడును ప్రయత్నించెడి వారని జ్ఞాపకముంచుకొనుము. అప్పటి లోపముల నెత్తిచూపుటకు వారెన్నడును భయపడలేదు. వారు విప్లవకారులు. ప్రాత సంప్రదాయము దారితప్పి దుష్టమైనప్పుడుగాని, భావివృద్ధికి ఆటంకముగా నున్నప్పుడుగాని వారు దానిని ఖండించి నిర్భయముగా తొలగించిరి. అంతకన్న ముఖ్యవిషయము వారు ఆదర్శప్రాయముగా జీవించుచు, తరతరముల ప్రజలకు, అసంఖ్యాకులకు, ఆదర్శజీవనము ఆచరణరూపముగా చూపియుండిరి. అట్టిజీవనము ప్రజలకు ఆదర్శమయినది. అట్లు బ్రతకవలెనని ఆవేశము నిచ్చినది,

క్రీస్తుకు పూర్వము ఆరవ శతాబ్దిని ఇండియాలో బుద్ధుడు, మహావీరుడు ఉండిరి : చీనాలో కంప్యూసియస్, లోచే లున్నారు ; పర్షియాలో జరతుష్ట్ర[1] ఉన్నాడు; గ్రీకుద్వీపమైన శామాస్‌లో పై తాగొరాస్‌ఉన్నాడు. వేరు వేరు సందర్భములలో ఈ పేళ్లు నీవు వినియుండవచ్చును. పైతాగొరాస్ క్షేత్రగణితములో ఒక సిద్ధాంతమును ఋజువు చేసిన అధికప్రసంగి అనియు, తాము. పాపము, దానినిప్పుడు నేర్చుకోవలసి వచ్చినదనియు సాధారణముగా బడికిపోవు బాలబాలికలు తలతురు. ఈసిద్ధాంతము సమకోణ త్రిభుజము యొక్క భుజముల చతురములకు సంబంధించినది. ఇది యూక్లిడ్ గ్రంథములోను, ఇతర క్షేత్రగణితములలోను ఉండును, క్షేత్రగణితములో అతడు కనిపెట్టిన విషయముల మాట అటుంచిన పై తాగొరాస్ ఒక గొప్ప తత్వవేత్త. అతనిని గురించి మనకెక్కువగా తెలియదు. కొందరు అట్టివాడొకడుండుట సందేహాస్పద మందురు.

పర్షియాలో పుట్టిన జొరాష్టరు (జరతుష్ట్ర) జొరాస్ట్రియను మతమును స్థాపించెనని చెప్పుదురు. ఆతనిని మతస్థాపకుడనుట సరికాదేమో!

  1. జరతుష్ట్ర బహుశా క్రీస్తు పూర్వము ఎనిమిదవ శతాబ్దిలో ఉండియుండ వచ్చును.