పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

ప్రపంచ చరిత్ర

ఇట్లే ఆర్యగ్రీకులు గ్రీసుకు వచ్చినప్పుడు అచ్చట క్నోస్సోస్ యొక్క ప్రాచీన నాగరికత వర్దిల్లుచున్నది. వారిపై ఈ నాగరికత తన ప్రభావము నధికముగా చూపియుండవలెను. అయినను, వారు క్నోస్సోసును నాశనముచేసిరి. దాని బాహ్యనాగరికతను హెచ్చుభాగము నాశనముచేసిరి. దాని శిథిలములపై తమ నాగరికతను నిర్మించుకొనిరి. ఆ రోజులలో ఆర్య ఇండియనులును, ఆర్య గ్రీకులును మోటుగా నుండి రనియు, యుద్ధప్రవీణులనియు మనము జ్ఞాపకముంచుకొనవలెను. వారు వీర్యవంతులు. వారికి తటస్థించిన దేశములో ఎక్కువ నాగరీకులైన ప్రజలుండి వారు మెత్తనివారైనచో వారిని నాశనము చేయుచుండిరి. లేదా వారిని తమలో కలుపుకొనుచుండిరి.

క్రీస్తు పుట్టుటకు సుమారు 1000 సంవత్సరముల ముందు క్నోస్సోస్ నాశనముచేయబడెను. క్రొత్తగా వచ్చిన గ్రీకులు గ్రీసులోను, తత్ప్రాంత ద్వీపములలోను స్థిరనివాసము లేర్పరుచుకొనిరి. సముద్ర మార్గముగుండా ఆసియామైనరు పశ్చిమతీరమునకును, దక్షిణ ఇటలీకిని, సిసిలీకిని. ఫ్రాంసు దక్షిణమునకు సైతము వారు వెళ్ళిరి. ఫ్రాంసులోని మార్సైల్సు పట్టణమును వారు స్థాపించిరి. కాని బహుశా వారు వెళ్ళు టకు ముందే ఫొనీషియను లచట నివాస మేర్పాటుచేసికొని యుందురు. నీకు జ్ఞాపకమున్నదో లేదో.. ఫొనీషియనులు ఆసియా మైనరులోని ఒక గొప్ప నావికజాతివారు. వర్తకమునకై వారు నాలుగు దిక్కులకు వెళ్లు చుండిరి. ఇంగ్లాండు అనాగరిక దేశముగానున్న ఆ రోజులలో, జిబ్రాల్టరు జలసంధి ద్వారా పోవుట ప్రమాదకరమైనప్పటికిని, వారు ఇంగ్లాండు సైతము చేరిరి.

గ్రీసు దేశములో ప్రఖ్యాత నగరములు వెలిసినవి : ఏథెన్సు, స్పార్టా, థీబ్సు, కోరింత్. గ్రీకులనే హెల్లనీ లందురు. వారి తొలినాళ్ళ ముచ్చటలు రెండు మహాకావ్యములలో వర్ణింపబడినవి. అవి "ఇలియడ్" “ఓడిస్సె" అను పేర్లుగలవి. వీనిని గురించి నీకు కొంచెముగా తెలియును