పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హెల్లనీలు

43


గదా. అవి మన రామాయణ మహాభారతములవంటివే. అంధకవియగు హోమరు వానిని రచించెను. పారిస్ అనువాడు హెలెన్ అను సుందరిని తన పట్టణమైన ట్రాయికి కొంపోయినట్లును, గ్రీకురాజులును, ప్రముఖులును ఆమెను తిరిగి వశపరుచుకొనుటకు ట్రాయిపట్టణమును ముట్టడించి నట్లును ఇలియడ్ చెప్పుచున్నది. ఒడిసస్(యులిసస్) అనువాడు ట్రాయి ముట్టడినుండి తిరిగివచ్చుచు చేసిన ప్రయాణములను "ఒడిస్సె" వర్ణించు చున్నది. ఆసియామైనరులో, తీరమునకు సమీపమున నీ ట్రాయి పట్టణ ముండెను. ఇప్పుడదిలేదు. ఆది అంతరించి యెంతోకాలమైనది. కానీ ఆ కవిప్రతిభ దాని కమరత్వ మిచ్చినది.

హెల్లనులు (గ్రీకులు) త్వరత్వరగా (కొద్దికాలమే నీలిచిన) ఉచ్చస్థితి నందున్న కాలములో వేరొకజాతి చల్లగా తలయెత్తుచుండెను, తరువాత ఆ జాతి గ్రీసును జయించి దానిస్థానము నాక్రమించెను. ఈ కాలమునందే రోముపట్టణము ప్రతిష్ఠింపబడినదని చెప్పుదురు. ప్రపంచరంగమున పలువందల సంవత్సరములవరకు అది ముఖ్యపాత్రను ధరించలేదు. కాని శతాబ్దులకాలము యూరోపులో అగ్రస్థానము పొంది "ప్రపంచలక్ష్మి" యనియు, “శాశ్వత నగర" మనియు పేరొందిన గొప్ప నగరముయొక్క జనన వృత్తాంతమును మునము చెప్పుకొనక తప్పదు. రోముప్రతిష్ఠనుగూర్చి వింత కతలను చెప్పుదురు రీమస్, రోములస్ అను ఇద్దరు శిశువులను ఒక ఆడుతోడేలు తీసికొనిపోయి పెంచినట్లును, వారు రోమును ప్రతిష్ఠించినట్లును, ఇత్యాదిగా. నీ కా కథ తెలియునేమో!

రోమునగరమును నిర్మించినప్పుడో, అంతకు కొంచెముముందో వేరొక నగరము నిర్మించబడినది. దీని పేరు కార్తేజీ. ఇది ఆఫ్రికా ఉత్తర తీరమందున్నది. దీనిని ప్రతిష్ఠించినది ఫోనీషియనులు, నముద్రముపై అధికారము చలాయించు గొప్పజాతిగా అది యభివృద్ధిచెందినది. దానికిని రోమునకును తీవ్రస్పర్ధలు చెలరేగినవి. యుద్ధము లెన్నో జరిగినవి. చివరకు రోముజయమునందినది. కార్తేజిని మూలమట్టుగ నాశనము చేసినది.