పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హెల్లనీలు

41

వెనుకటి జాబులో యూరోపు, ఆసియాల భేదసాదృశ్యములను గమనించితిమి. ప్రాతయూరోపును – ఒకమారు కొంచెము చూతము. చాలకాలమువరకు యూరోపనగా మధ్యధరాసముద్ర ప్రాంతములందున్న దేశములనియే యభిప్రాయము. ఆ రోజులలో యూరోపు ఖండమందలి యుత్తరదేశములనుగూర్చి చెప్పు ఆధారము లేమియులేవు. జర్మనీ, ఇంగ్లాండు, ఫ్రాంసు దేశములలో అనాగరికజాతులు నివసించుచుండిరని మధ్యధరాసముద్రప్రాంత జనులు ఊహించుచుండిరి. అసలు ప్రారంభమున, నాగరీకము తూర్పు మధ్యధరా ప్రాంతములలోనే నెల కొనినదని యూహింపబడుచున్నది. ఈజిప్టును (ఇది ఆఫ్రికాలోనున్నది సుమా, యూరోపులో కాదు.) క్నోస్సోసును ప్రపథమమున ముందంజ వేసిన దేశములు. క్రమక్రమముగా ఆసియా నుండి ఆర్యులు పడమటి దిక్కునకు బహుసంఖ్యాకులుగా వచ్చిపడి, గ్రీసుమీదను, సమీపదేశముల మీదను దండయాత్రలు సాగించిరి. వీరే ఆర్యులగు గ్రీకులు. వీరినే మన మెరుగుదుము. ప్రాచీన గ్రీకులని మెచ్చుకొనుచున్నాము, బహుళా అంతకుముందు ఇండియాలో ప్రవేసించిన ఆర్యులకును, వీరికిని మొదట అధిక భేదములు లేవని నే ననుకొందును. తరువాత భేదములు ప్రవేశించి యుండవలెను. క్రమక్రమముగా ఆర్యుల ఈ రెండు శాఖలును అంతకంత కెక్కువగా వేరుపడిపోయినవి. అప్పటికే ఇండియాలోనున్న, అంతకన్న ప్రాచీనమైన, నాగరికత ఇండియాకువచ్చిన ఆర్యులపై తన ప్రాభవమును చూపినది. అది ద్రావిడుల నాగరికత కావచ్చును. లేదా మొహెంజోదారో వద్ద నేడు మనము చూచు శిథిలములకు సంబంధించిన నాగరీకావశేషము కావచ్చును. ఆర్యులు ద్రావిడులనుండి ఎన్నో విషయములు నేర్చు కొనిరి. వారి కెన్నో విషయములు నేర్పిరి. అట్లే ద్రావిడులు ఆర్యులనుండి ఎన్నో విషయములు నేర్చుకొనిరి. వారి కెన్నో విషయములు నేర్పిరి. ఈ విధముగా వా రుభయులునుకలిసి ఉమ్మడిగా ఇండియాలో విజ్ఞానమును సృష్టించిరి.