పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హెల్లాసు మహత్తర ప్రతిభ

101


మాత్రమే వారు పనిచేయుచుండిరి. స్వాతంత్ర్యము చేజిక్కగానే ఎవరికి వారు, ఇతరుల ప్రోద్బలములేకుండగనే తమశక్తివంచనలేకుండ పనిచేసిరి."

ఆకాలమునాటి ప్రసిద్ధపురుషుల పేళ్లు పేర్కినియుంటిని. వారందరికన్నను గొప్పవాడు - ఆకాలమునందున్నను గొప్ప వాడనిపించుకోదగ్గవాడు. - అయిన పురుషుని నేనింకను పేర్కొనలేదు. అతని పేరు సోక్రటీసు. అతడు తత్వవేత్త. సత్యాంవేషణమే అతని నిరంతర కృషి. మనష్యున కుండదగ్గది జ్ఞాన మొక్కటే యని అతని యభిప్రాయము. క్లిష్టసమస్యల నాతడు తన మిత్రులతోను, పరిచయములతోను తరచు చర్చించుచుండెను. చర్చలఫలితముగా సత్యము వెల్లడియగునని అతని యాశయము. అతనికి శిష్యులనేకులు గలరు. వారందరిలోను గొప్పవాడు ప్లేటో. ప్లేటో అనేకగ్రంథములను వ్రాసెను. అవి మనవరకు వచ్చినవి. ఈ గ్రంథములనుబట్టియే అతని గురువైన సోక్రటీసును గురించిన విషయములు పెక్కులు మనము తెలిసికోగలిగితిమి. నూతన విషయములను కనుగొనగోరువారిని చూచిన దొరతనములకు కన్నుకుట్టుట వాస్తవము. సత్యాంవేషణ చేయుట వారికి కిట్టదు. ఏథెన్సు దొరతనము సోక్రటీసు పద్దతుల నిష్టపడలేదు. విచారణచేసి సోక్రటీసుకు మృత్యుదండన విధించెను. ప్రజలతో చర్చలు కట్టిపెట్టి, తనపద్ధతులు మార్చుకొనుటకు సమ్మతించి. ఆవిధముగా వాగ్ధానము చేసినయెడల వదిలి పెట్టుదుమని వారు చెప్పిరి. అత డట్లు చేయుటకు నిరాకరించెను. తన ధర్మమును పరిత్యజించుటకంటె విషముత్రాగుటయే సమ్మతమని చెప్పి, గిన్నెలో తెచ్చిన విషమును త్రాగి యాతడు మరణించెను. మృత్యుముఖములో ప్రవేశించుటకు ముందు తనపై నేరము మోపినవారిని, తీర్పు చెప్పినవారిని ఉద్దేశించి అత డిట్లు చెప్పెను.

"నా సత్యాన్వేషణమును పరిత్యజించిన నన్ను మీరు వదలిపెట్టెద రని మీరనినదానికి నేను చెప్పు సమాధానమిది. ఏథెన్సు ప్రజలారా! మీకు నమస్కారము. ఈ కార్యమునందు నన్ను భగవంతుడు నియోగించినని నా