పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

ప్రపంచ చరిత్ర


నమ్మకము. కాబట్టి అతని యాదేశముప్రకారమే చేయుదును. మీ మాటలు లెక్కపెట్టను. కంఠములో ఊపిరి, శరీరమున బలము ఉన్నంతకాలము తత్త్వజిజ్ఞాస మానను. నేనెవరిని కలిసికొన్నను వారిని కుశలమడిగి వారితోనిట్లు చెప్పుదును : "ధనముకొరకును, గౌరవములకొరకును మీరు ప్రాకులాడుచున్నారు. సత్యవివేకములపై మీకు శ్రద్ధలేదు. ఆత్మను నిరసింపజేసికొనవలెను నను శ్రద్ధ మీకులేదు. ఇందుకై మీరు సిగ్గుపడవద్దా? మృత్యువన్న నేమో నాకు తెలియదు. అది మంచిది కావచ్చును. మృత్యువన్న నాకు భయములేదు. కాని నేను నమ్మిన ధర్మమును నేను పరిత్యజించుట చెడ్డదని అని నాకు తెలియును. చెడ్డదని తెలిసిన పనిని నేను చెయ్యను. మంచిది కావచ్చు నన్నదానినే కోరుదును."

బ్రతికియుండి సోక్రటీసు సత్యజ్ఞానములకొరకై చక్కగా పాటుపడెను. మరణించుటవల్ల అంతకన్న అతిశయముగా వాటికి సేవచేసినట్లయినది.

ఈ రోజులలో అనేక సమస్యలనుగూర్చిన చర్చలు, వాదములు నీవు వినుచుందువు. చదువుచుందువు - సాంఘీకవాదమును, ధనికపక్షవాదమును, ఇతరవాదములను గూర్చిన చర్చలు, వాదములు. ఈప్రపంచమున బాధలు, అన్యాయము అధికముగా నున్నవి. పలువుర కిందలి పరిస్థితులు అసంతృప్తికరముగా నున్నవి. వాటిని మార్చవలెనని వారు పూనుకొనిరి. ప్రభుత్వమునకు సంబంధించిన సమస్యలను ప్లేటోకూడ ఆలోచించెను. దీనినిబట్టి చూడ ఆరోజులలోసైతము అందరును సుఖముగా జీవించగలుగుటకు దేశప్రభుత్వమునకును, సంఘమునకును ఎట్టి రూపము నీయవలెనో ప్రజలాలోచించు చుండిరని తేలుచున్నది.

ప్లేటో వార్ధక్యదశ నందుచుండగా వేరొక ప్రసిద్ధ గ్రీకుపురుషుడు రంగమునకు దిగుచుండెను. అతని పేరు అరిష్టాటిల్. ఘనుడగు అలెగ్జాండరు కతడు ఇంటివద్ద పాఠములుచెప్పు ఉపాధ్యాయుడు. అలెగ్జాండ రతని కార్యమునకు చాల తోడ్పడెను. సోక్రటీసువలెను, ప్లేటోవలెను అతడు తత్వశాస్త్ర సమస్యలనుగూర్చి విచారణపెట్టుకొనలేదు. ప్రకృతి