పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

ప్రపంచ చరిత్ర


తెలిసినంతమట్టుకు తొలుతటి దశ వేదములును, ఉపనిషత్తులును, ఇతర గ్రంథములును పుట్టిన కాలము. దురదృష్టవశమున ఆప్రాచీనకాలమును గూర్చి చెప్పు గ్రంథములేమియు లేవు. ఎన్నోచక్కని గొప్పగ్రంథములు అంతరించియుండవచ్చును. లేదా ముందుముందు మనకు దొరకవచ్చును. ఉన్నదానినిబట్టి చూడ ప్రాచీనకాలమునాటి హిందూదేశస్థులు ఎంతటి అఖండమైన బుద్ధియు, ప్రజ్ఞయు కలవారో తెలిసికొనవచ్చును. తరువాత కాలమునాటి హిందూదేశ చరిత్రలోకూడ అట్టి తేజోవంతమగు దశలున్నవి. యుగములలో మనము చేయుచున్న సంచారములందు దానిని మనము చూడవచ్చును.

ఈకాలమున ముఖ్యముగా ఏథెంసు ప్రసిద్ధికివచ్చెను. దానినాయకు డొక గొప్ప రాజకీయవేత్త. అతని పేరు పెరిక్లీసు. ముప్పది సంవత్సరములపాటు అతడు అధికారపదవియం దుండెను. ఈ కాలమున ఏథెన్సు గొప్ప నగరమైనది. చక్కని భవనములతో, గొప్ప చిత్రకారులతో, గొప్ప తత్వవేత్తలతో అది నిండియుండెను. నేడుకూడ దానిని పెరిక్లీసుయొక్క ఏథెన్సు అందురు. పెరిక్లీసుయుగ మను నానుడికూడ కలదు.

ఈకాలమునందే ఏథెన్సులోనున్న చరిత్రకారుడగు మన హెరొడోటస్ ఏథెన్సు పొందిన యభివృద్ధినిగూర్చి తన యభిప్రాయమును చెప్పెను. నీతులు చెప్పుట అతనికిష్టము. కాన పైవిషయములనుగూర్చి యాతడు నీతిని చెప్పెను. తన చరిత్రలో నాత డిట్లు వ్రాసెను.

"ఏథెన్సు ప్రభుత్వ మతిశయించెను. స్వాతంత్ర్యము మంచిదనుట కిది నిదర్శనము. దీనిని ఋజువుచేయుటకు ప్రతిచోటను దృష్టాంతములు గలవు. ఏథెన్సుప్రజలు నిరంకుశప్రభుత్వముక్రింద మ్రగ్గుచున్నప్పుడు యుద్ధకౌశలము వారికి పొరుగువారికన్న నధికముగాలేదు. నిరంకుశ ప్రభువును వారు వదల్చుకొన్నపిమ్మట యుద్ధమున, పొరుగువారిని వారు మించిరి. ఒకనికి లొంగి యున్నప్పుడు వారు పురుషప్రయత్నము చేయలేదు. యజమాని కొరకు