పుట:నాగార్జున కొండ.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాగార్జునుడు, నాగార్జున కొండ

5

కొండకి వర్తిస్తుంది. అందువల్ల నాగార్జున బోధిసత్వుడు ఈ కొండమీద నివసించడంవల్లనే ఈ కొండకి నాగార్జునకొండ అనే పేరు వచ్చింది అని నిర్ణయించవచ్చును.

ఈ నాగార్జునుడు విదర్భ దేశంలో జన్మించిన బ్రాహ్మణుడు. మహా మేధావి అయిన ఇతడు బాల్యంలోనే సర్వశాస్త్రములను అభ్యసించి, హేతువిద్యలోనూ, ఇంద్రజాలంలోనూ నిపుణుడు ఆయాడు. యౌవనంలోనే సన్యసించి ఇతడు దేశాటనం చేశాడు. హిమాలయాలలో ఒక ముసలి భిక్షువువద్ద ఇతడు ఎన్నో మహా యాన బౌద్ధమత గ్రంథాలని చూచి, వాటి సారం గ్రహించాడు. అమీద నాగార్జునుడు సింహళద్వీపానికి పోయి అక్కడనించి మరి కొన్ని గ్రంథాలు తెచ్చాడు. వీటిలో చాలా గ్రంథాలమీద ఇతడు చక్కని వ్యాఖ్యానాలు వ్రాసి మహాయానమతం అందరికీ తెలిసే టట్టు చేశాడు. ఆమీద ఈ మహనీయుడు తన పాండిత్యాన్ని, ఉపజ్ఞనీ తోడుచేసుకొని మాధ్యమికవాదమూ, శూన్యవాదమూ అనే క్రొత్త సిద్ధాంతాలని ప్రతిపాదించి, ప్రచారం చేశాడు. అనేక మంది శిష్యులూ, ప్రశిష్యులూ ఈ సిద్ధాంతాలని దేశమంతా ప్రచారం వేశారు. ఈ ఆచార్యుడు వ్యాఖ్యానములుకాక 24 స్వతంత్ర గంథాలు వ్రాశాడు. నాగార్జునుడు కొంతకాలం కుషాను రాజైన హువిష్కుడి ఆస్థానంలో ఉన్నాడు. అమీద విదర్భలో ఒక సంఘారామంలో ఇంతకాలం నివసించాడు. చివరకి కృష్ణాతీరాన వున్న శ్రీపర్వతం (నాగార్జునకొండ) మీది విహారంలో జీవిత శేషం గడిపాడు.