పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆపరాధిక న్యాసభంగమును గురించీ

అపరాధిక న్యాస భంగము,

405. ఆస్తి గాని, ఆస్తిపై ఆధిపత్యముగాని ఏదేని రీతిగా అప్పగింపబడియుండి, ఆ ఆస్తిని నిజాయితీ లేకుండ దుర్వినియోగము చేయు, లేక సొంతము చేసికొను, లేక అట్టి న్యాసమును నిర్వహించు పద్ధతిని విహితపరచు ఏదేవి శాసనాదేశమునుగాని అట్టి న్యాస నిర్వహణమునకు సంబంధించి తాను చేసికొనిన, అభివ్యక్త మైనదైనను, గర్భితమైన దైనను, ఏదేని శాసనబద్ధ మైన కాంట్రాక్టునుగాని అతిక్రమించి ఆ ఆస్తిని నిజాయితీ లేకుండ ఉపయోగించుకొను,లేదా వ్యయనముచేయు లేదా బుద్ధి పూర్వకముగ ఏవ్యక్తి నైనను, ఆట్లు చేయనిచ్చు వారెవరైనను “ఆపరాధిక న్యాస భంగము" చేసిన వారగుదురు.

విశదీకరణము 1 :-తత్సమయమున అమలునందున్న ఏదేని శాసనము ద్వారా నెలకొల్పబడిన భవిష్యనిధికి గాని, కుటుంబ ఫింఛను నిధికిగాని జమకట్ట బడుటకై ఉద్యోగి వాటాను ఉద్యోగికి చెల్లింపవలసిన వేతనములనుండి బిగబట్టు కొనునట్టి నియోజకుడై యున్న వ్యక్తి కి, ఆట్లు అతనిచే బిగబట్టు కొనబడిన వాటా మొత్తము అప్పగింప బడినట్లు భావించవలెను. మరియు సదరు శాసనమును అతిక్రమించి అట్టి వాటాను సదరు నిధికి ఆతడు చెల్లింపని చో, పైన చెప్పబడిన శాసనాదేశమును అతిక్రమించి అట్టి వాటా మొత్తమును నిజాయితీ లేకుండ అతడు ఉపయోగించు కొనినట్లు భావించవలెను.

విశదీకరణము 2 : ఉద్యోగుల రాజ్య భీమా చట్టము, 1948- (1948లోని 34వ చట్టము) క్రింద నెలకొల్పబడిన ఉద్యోగుల రాజ్య భీమా కార్పొరేషను పరమందుండి నిర్వహింపబడు ఉద్యోగుల రాజ్య భీమానిధికి జమ కట్టబడుటకై ఉద్యోగి వాటాను ఉద్యోగికి చెల్లింపవలసిన వేతనములనుండి బిగబట్టు కొనునట్టి నియోజకుడై యున్న వ్యక్తి కి, అట్లు ఆతనిచే బిగబట్టు కొనబడిన వాటా మొత్తము అప్పగించబడినట్లు భావించవలెను. మరియు సదరు శాసనమును అతిక్రమించి, అట్టి వాటాను సదరు నిధికి అతడు చెల్లింపనిచో, పైనచెప్పబడిన శాసనాదేశమును అతిక్రమించి. అట్టి వాటా మొత్తమును నిజాయితీ లేకుండ అతడు ఉపయోగించుకొనినట్లు భావించవలెను.

ఉదాహరణములు

(ఏ) ఒక మృతవ్యక్తి యొక్క వీలునామాకు 'ఏ' అను నతడు నిర్వాహకుడై యుండి, మృతవ్యక్తి చరాస్తులను వీలునామా ననుసరించి విభజించవలెనను శాసనాదేశమును నిజాయితీలేకుండ పాటింపక వాటిని సొంతముచే కొనును. 'ఏ' ఆపరాధిక న్యాసభంగము చేసినవాడగును.

(బీ) ఏ' అనునతడు ఒక గిడ్డంగిపాలకుడు, 'జడ్' ప్రయాణమై పోవుచు, తన గృహసామగ్రిని 'ఏ' అప్పగించి ఒక నిర్ణీత మొత్తమును గిడ్డంగి గదికై తాను చెల్లించిన మీదట తనకు తనగృహ సామగ్రిని వాపసు చేయవలసినదని కాంట్రాక్టు చేసికొనును. 'ఏ'ఆ సరుకులను నిజాయితీ లేకుండ అమ్మివేయును. 'ఏ' ఆపరాధిక న్యాస భంగము చేసినవాడగును.

(సీ) కలకత్తాలో నివసించుచున్న 'ఏ' అనునతడు డిల్లీ లో నివసించుచున్న 'జడ్'కు ఏజెంటు. 'ఏ'కు 'జడ్' పంపే మొత్తములన్నియు 'జడ్' ఆదేశానుసారముగ 'ఏ' పెట్టుబడి పెట్టవలెనని 'ఏ', 'జడ్'ల మధ్య ఒక అభివ్యక్తమైన లేక గర్భితమైన కాంట్రాక్టు కలదు. కంపెనీవారి పత్రములలో పెట్టుబడి పెట్ట వలసినదను ఆదేశములతో 'జడ్' 'ఏ'కు ఒక లక్ష రూపాయలను పంపును. 'ఏ' నిజాయితీలేకుండ ఆ ఆదేశములను పాటించక ఆ డబ్బును సొంత వ్యాపారములో వాడుకొనును. 'ఏ' అపరాధిక న్యాసభంగము చేసిన వాడగుసు,

(డీ) అయితే, పై కడపటి ఉదాహరణములో బెంగాలు బ్యాంకులో షేర్లను కలిగియుండుట 'జడ్'కు ఎక్కువ లాభదాయకమని 'ఏ' నిజాయితీగా సద్భావముతో విశ్వసించుచు, కంపెనీవారి పత్రములు కొనుటకు బదులుగా 'జడ్' యొక్క ఆదేశములను పాటించక బెంగాలు బ్యాంకులో షేర్లను కొనినచో, ఇచ్చట 'జడ్'కు నష్టము కలిగినప్పటికీ, ఆ నష్టమునకై 'ఏ' పై సివిలు చర్యలు తీసుకొనుటకు అతనికి హక్కు ఉన్నప్పటికినీ, 'ఏ' నిజాయితీ లేకుండ వ్యవహరించనందున, అపరాధిక న్యాసభంగము చేయలేదు.

(ఈ) 'ఏ' అను రెవెన్యూ అధికారికి పబ్లికు డబ్బు అప్పగింపబడి యున్నది. తన పరమందున్న పబ్లికు డబ్బు నంతను, శాసనాదేశానుసారముగా, లేక ప్రభుత్వముతో తనకుగల అభివ్యక్తమైన లేక గర్భితమైన కాంట్రాక్టు వలన, అతడు ఒకానొక ఖజానాలో చెల్లించవలసియున్నది. 'ఏ' ఆ డబ్బును నిజాయితీ లేకుండ వినియోగించుకొనును. 'ఏ' ఆపరాధిక న్యాసభంగము చేసినవాడగును.