పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(ఎఫ్) వాహకుడైన 'ఏ' అనునతనికి తనఆస్తిని భూమార్గమునగాని జలమార్గమునగాని తీసికొనిపోవుటకై 'జడ్' అప్పగించెను, ఆ ఆస్తిని నిజాయితీలేకుండ 'ఏ' దుర్వినియోగము చేయును, 'ఏ' ఆపరాధిక న్యాస భంగము చేసిన వాడగును.

అపరాధి న్యాస భంగము చేసినందుకు శిక్ష

406. ఆపరాధిక న్యాస భంగముచేయు వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

వాహకుడు మొదలగు వారు చేయు ఆపరాధిక న్యాసభంగము.

407. నాహకుడుగా, రేవు గిడ్డంగి పాలకుడుగా, లేక గిడ్డంగి పాలకుడుగా ఆస్తి ఆప్పగింపబడియుండి, అట్టి ఆస్తి విషయమున ఆపరాధిక న్యాసభంగముచేయు వారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

గుమాస్తా లేక సేవకుడు చేయు ఆపరాధిక న్యాసభంగము.

408. గుమాస్తా యై యుండి లేక సేవకుడై యుండి, లేక గుమాస్తా గానై నను సేవకుడుగానై నను వినియోగింపబడియుండి ఆట్టి హెదాలో ఏ రీతిలోనై నను ఆస్తి గాని, ఆస్తి పై ఆధిపత్యముగాని అప్పగించబడియుండి, ఆ ఆస్తి విషయమున ఆపరాధిక న్యాసభంగము చేయువారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

పబ్లికు సేవకుడు,బ్యాంకరు వ్యాపారస్తుడు లేక ఏజెంటు చేయు అపరాధిక న్యాస భంగము

409. పబ్లికు సేవకుడుగా తన హోదాలో గాని, బ్యాంకరుగా, వ్యాపారస్తుడుగా, అడీ దారుగా, దలారీగా, అటార్నీగా లేక ఏజెంటుగా తన వ్యాపార సరళితో గాని, ఆస్తి లేక ఆస్తి పై ఏదేని ఆధిపత్యము ఏ రీతిలొనైనను అప్పగించబడి యుండి, ఆ ఆస్తి విషయమున ఆపరాధిక న్యాసభంగము చేయు వారెవెరైనను యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో గాని, శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు.

దొంగలింపబడిన ఆస్తిని స్వీకరించుటను గురించి

దొంగిలింపబడిన ఆస్తి.

410. దొంగతనము ద్వారా గాని, బలాద్గ్ర హణముద్వారా గాని, దోపిడీ ద్వారా గాని, స్వాధీనము బదిలీ అయిన ఆస్తియు, అపరాధిక దుర్వినియోగమునకు లేక ఆపరాధిక న్యాసభంగము నకు గురిఅయిన ఆస్తియు, ఆ బదిలీ లేదా దుర్వినియోగము, లేదా న్యాస భంగము, భారతదేశములోపల జరిగినను, వెలుపల జరిగినను, దొంగిలింపబడిన ఆస్తి అని పేర్కొబడును. ఆయితే, అట్టి ఆస్తిని స్వాధీనపరచుకొనుటకు శాసనరీత్యా హక్కుగల వ్యక్తి యొక్క స్వాధీనములోనికి ఆ ఆస్తి అటుతర్వాత వచ్చినచో అప్పుడు అది దొంగిలింపబడిన ఆస్తి గ పరిగణింపబడదు.

దొంగిలింపబడిన ఆస్తిని నిజాయితీ లేకుండ స్వీకరించుట.

411, దొంగలింపబడిన ఆస్తిని, దేనినైనా, అది దొంగలింపబడిన ఆస్తియని ఎరిగియుండి, లేక దొంగిలింపబడిన ఆస్తియని విశ్వసించుటకు కారణముండి, నిజాయితీ లేకుండ స్వీకరించు లేక వద్ద ఉంచుకొను వారెవరై నను మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

బందిపోటు చేయుటలో దొంగిలింపబడిన ఆస్తిని నిజాయితీ లేకుండ స్వీకరించుట.

412. బందిపోటు చేయుటద్వారా ఆస్తి యొక్క స్వాధీనము , బదిలీ అయినదని తాను ఎరిగియున్నట్టి లేక ఆట్లు విశ్వసించుటకు తనకు కారణమున్నట్టి దొంగలింపబడిన ఆస్తిని నిజాయితీలేకుండ స్వీకరించు లేక వద్ద ఉంచుకొను నతడెవరైనను, దొంగలింపబడినదని తాసు ఎరిగియున్నట్టి, లేక అట్లు విశ్వసించుటకు తనకు కారణమున్నట్టి ఆస్తి ని బందిపోటు ముఠాకు చెందినవాడని, లేదా చెందియుండినవాడని తాను ఎరిగియున్నట్టి, లేక అట్లు విశ్వసించుటకు తనకు కారణమున్నట్టి, వ్యక్తి నుండి నిజాయితీ లేకుండ స్వీకరించు నతడెవరైనను, యావజ్జీవ కారావాసములోగాని, పది సంవత్సశములదాకా ఉండగల కాలావధికి కఠిన కారావాసముతోగాని శిక్షింపబడును. మరియు జుర్మానాకుకూడ పాత్రుడగును.

దొంగిలింపబడిన ఆస్తితో పరిపాటిగా వ్యాపారము చేయుట.

413. దొంగలింపబడిన ఆస్తియని తాను ఎరిగియున్నట్టి లేక ఆట్లు విశ్వసించుటకు తనకు కారణమున్నట్టి ఆస్తిని పరిపాటిగా స్వీకరించు, లేక అట్టి ఆస్తి తో పరిపాటిగా వ్యాపారము చేయు నతడెవరై నను, యావజ్జీవ కారావాసముతోగాని, పది సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని శిక్షింపబడును మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును.

దొంగిలింపబడిన ఆస్తిని దాచుటలో సహాయపడుట.

414. దొంగిలింపబడిన ఆస్తియని తాను ఎరిగియున్న, లేక అట్లు విశ్వసించుటకు తనకు కారణమున్నట్టి ఆస్తి ని దాచుటలో, లేక వ్యయసము చేయుటలో, లేక కొట్టి వేయుటలో స్వచ్చం దముగ సహాయపడు వారెవరైనను మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జూర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.