పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హత్యా ప్రయత్నము.

307. ఎవరై నను ఎట్టి ఉద్దేశముతో లేక ఎట్టి ఎరుకతో మరియు ఎట్టి పరిస్థితులలో ఏదేని కార్యమును చేసి మరణమును కలుగజేసియుండినచో అతడు హత్యచేసిన దోషియై యుండెడివాడా, అట్టి ఉద్దేశముతోను, లేక ఎరుకతోను మరియు అట్టి పరిస్థితులలోను ఆ కార్యమును చేయు నతడెవరైనను పది సంవత్సములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడును మరియు జుర్మానకు కూడా పాత్రుడగును. మరియు, అట్టి కార్యము ద్వారా ఏవ్యక్తికైనను ఘాత కలిగింపబడినచో, అపరాధి యావజ్జీవ కారావాసముతో గాని, ఇంతకు పూర్వము పేర్కొనబడినట్టి శిక్షకు గాని పాత్రుడగును.

యావజ్జీవ ఖైదీలు చేయు ప్రయత్నములు,

యావజ్జీవ కారావాసమునకు దండనోత్త రువు ఈయబడియుండి, ఈ పరిచ్చేదము క్రింద అపరాధము చేయు ఏ వ్యక్తి యైనను ఘాత కలిగించినచో మరణ దండనతో శిక్షింపబడవచ్చును.

ఉదాహరణములు

(ఏ) 'జడ్' ను చంపవలేనని ఉద్దేశముతో, అతనికి మరణము కలిగించినచో తాను హత్యా దోషియగునట్టి పరిస్థితులలో, 'ఏ' తుపాకిని 'జడ్' పై కాల్చును. 'ఏ' ఈ పరిచ్ఛేదము క్రింద శిక్షాపాత్రుడగును.

(బీ) పసిబిడ్డకు మరణము కలిగించు ఉద్దేశముతో 'ఏ ' ఆ బిడ్డను నిర్మానుష్యమైన స్థలమునంద, అరక్షితముగా వదలివేయును. ఆ బిడ్డ మరణించినప్పటికిని, ఈ పరిచ్చేదములో నిర్వచింపబడిన అపరాధమును 'ఏ' చేసిన వాడగును. . (సీ) 'జడ్' ను హత్య చేయవలెనని ఉద్దేశించి 'ఏ' ఒక తుపాకిని కొని, దానిని మందుగుండుతో నింపున, 'ఏ ' ఇంకను అపరాధమును చేయలేదు. 'ఏ' ఆ తుపాకిని 'జడ్' పై కాల్చును. అతడు ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసినవాడగుసు, మరియు కాల్పులు జరుపుట ద్వారా అతడు 'జడ్' ను గాయపరచినచో అతడు ఈ పరిచ్ఛేదము మొదటి పేరాయొక్క చివరి భాగమునందలి నిబంధనానుసారముగల శిక్షకు పాత్రుడగును,

(డీ) 'జడ్' ను విష ప్రయోగము చేయుట ద్వారా హత్య చేయవలెనని ఉద్దేశించి, 'ఏ' విషమును కొని తనవద్ద నున్న ఆహారములో దానిని కలుపును. ' ఏ.” ఈ పరిచ్చేదములో నిర్వచింపబడిన అపరాధమును ఇంకను చేయలేదు. 'ఏ' ఆ ఆహారమును 'జడ్' బల్లపై ఉంచుసు, లేక 'జడ్' బల్ల పై పెట్టుటకై 'జడ్'యొక్క సేవకులకు దానిని అందించును. 'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసిన వాడగును.

అపరాధిక మానవ వధ చేయుటకు ప్రయత్నము.

308. ఏదేని కార్ద్యమును ఎట్టి ఉద్దేశముతో లేక ఎట్టి ఎరుకతో, మరియు ఎట్టి పరిస్థితులలో ఎవరైనను చేసి మరణమును కలుగజేసి యుండినచో అతడు హత్య కానట్టి అపరాధిక మానవవధ చేసిన దోషియై యుండెడి వాడో, అట్టి ఉద్దేశముతోను, లేక ఎరుకతోను, మరియు అట్టి పరిస్థితులలోను ఆ కార్యమును చేయు వారెవరై నను మూడు సంవత్సరముల దాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానా తో గాని ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు, మరియు అట్టి కార్యము ద్వారా ఏ వ్యక్తి కైనను, ఘాత కలిగింపబడినచో, ఏడు సంవత్సముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితో గాని, శిక్షింపబడుదురు.

ఉదాహరణము

ఎట్టి పరిస్థితులలో తాను మరణమును కలుగజేసి యుండినచో హత్యకానట్టి అపరాధిక మానవవధ చేసిన దోషియై యుండెడివాడో, అట్టి పరిస్థితులలో 'ఏ' అకస్మాత్తు గా కలిగిన తీవ్ర ప్రకోపనమునకు గురియై 'జడ్' "పై పిస్తోలును కొల్చును. 'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసిన వాడగును.

ఆత్మహత్య చేసికొనుటకు ప్రయత్నము.

309. ఆత్మహత్య చేసికొనుటకు ప్రయత్నము చేసి, అట్టి అపరాధము చేయుటకై ఏదేని కార్యమును చేయు వారెవరైనను, ఒక సంవత్సరము దాకా ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని,జుర్మానాతో గాని ఈ రెండింటితో గాని, శిక్షింపబడుదురు.

థగ్గు

310. ఈ చట్టము చేయబడిన పిమ్మట ఎప్పుడైనను, హత్య చేయుట ద్వారా గాని, హత్య సహితముగ గాని దోపిడి చేయుటకై నను, బిడ్డలను ఎత్తుకు పోవుటకై నను ఎవరేని ఇతరునితో, లేక ఇతరులతో అలవాటుగా జట్టుగా యుండు నతడెవరైనను థగ్గు అనబడును.

311. థగ్గు అయిన ఎవరైనను, యావజ్జీవ కారావాసముతో శిక్షింపబడును, మరియు జుర్మానాకు కూడా పాత్రుడగును.