పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గర్భస్థులైన బిడ్డలకు హానిని కలిగించుట, శిశువులను అరక్షితముగా వదిలి వేయుట,

జననములను కప్పిపుచ్చుట--వీటిని గురించి.

గర్భస్రావము కలిగించుట.

312. గర్భవతియైన స్త్రీకి స్వచ్ఛందముగా గర్భస్రావము కలిగించువారెవరైనను, అటు గర్భస్రావమున కలిగించుట సద్భావముతో ఆ స్త్రీ ప్రాణమును కాపాడు నిమిత్తము కానిచో, మూడు సంవత్సములదాక ఉండగలు కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు, మరియు పిండము కదలాడుచున్న స్థితిలో ఆ స్త్రీ ఉన్నచో, ఏడు సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు,మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు.

విశదీకరణము :- తనకు తానే గర్భ స్రావము కలిగించుకొను స్త్రీ ఈ పరిచ్ఛేదము భాసములోనికి వచ్చును.

స్త్రీ సమ్మతి లేకుండ గర్భస్రావముకలిగించుట,

313. పిండము కదలాడెడి స్థితిలో స్త్రీ ఉన్నను లేకున్నను, ఆ స్త్రీ సమ్మతి లేకుండా పై కడపటి పరిచ్చేదములో నిర్వచింపబడిన అపరాధమును చేయు వారెవరైనను, యావజ్జీవ కారావాసముతోగాని పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు.

గర్భ స్రావమును కలిగించు ఉద్దేశ్యముతో చేసిన కార్యము ద్వారా మరణము కలుగుట.

314. గర్భవతియైన స్త్రీకి గర్భస్రావము కలిగించవలెనను ఉద్దేశముతో అట్టి స్త్రీకి మరణము కలిగించునట్టి ఏదేని కార్యమును చేయు వారెవరైనను, పది సంవత్సముల దాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు.

స్త్రీ సమ్మతి లేకుండా ఆ కార్యమును చేసినచో

ఆ స్త్రీ సమ్మతి లేకుండ ఆ కార్యమును చేసినచో యావజ్జీవ కారావాసముతోగాని, పైన పేర్కొనబడిన శిక్ష తో గాని శిక్షింపబడుదురు.

విశదీకరణము : -- ఆ కార్యము చేసి నందు వలన మరణము కలుగగలదని అపరాధికి తెలిసియుండ వలెననుట ఈ ఆపరాధమునకు అవశ్యకము కాదు

సజీవముగా బిడ్డ జన్మించకుండజేయవలెనను లేక జన్మించిన పిమ్మట ఆ బిడ్డకు మరణము కలిగించవలెనను ఉద్దేశ్యముతో చేసిన కార్యము.

315. బిడ్డ సజీవముగా జన్మించకుండా చేయవలెనను లేక జన్మించిన పిమ్మట మరణించినట్లు చేయవలెనను ఉద్దేశముతో, బిడ్డ పుట్టుటకు పూర్వము ఏదేని కార్యమును చేసి, తద్వారా ఆ బిడ్డ సజీవముగా జన్మించకుండా చేయలేక జన్మించిన పిమ్మట మరణించునటు చేయువారెవరైనను, సద్భావముతో తల్లి ప్రాణము కాపాడు నిమిత్తము, అట్టి కార్యము చేయనిచో, పది సంవత్సముల దాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని జుర్మానాతో గాని, ఈ రెంటితో గాని శిక్షింపబడుదురు.

అపరాధిక మానవ వధ అగునట్టి కార్యముద్వారా గర్భములో కదలాడు స్థితిలో నున్న బిడ్డకు మరణము కలుగించుట.

316. ఏదేని కార్యము ద్వారా తాను మరణమును కలిగించినచో అపరాధిక మానవధ చేసిన దోషియై యుండెడి పరిస్థితులలో ఆ కార్యమును చేసి తద్వారా గర్భములో కదలాడు స్థితిలో నున్న బిడ్డకు మరణము కలుగజేయు వారెవరైనను పది సంవత్సములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు.

ఉదాహరణము

గర్బిణి స్త్రీ కి మరణము కలిగించి యుండినచో అపరాధిక మానవవవధ అగునట్టి ఒక కార్యమును ఆ స్త్రీ కి మరణమును కలుగగలదని తెలిసి యుండియు 'ఏ' చేయును.ఆ స్త్రీ కి హాని కలిగినది, కాని ఆమె మరణించ లేదు. అయితే ఆమె గర్భములో కదలాడు స్థితిలో వున్న బిడ్డకు తద్వారా మరణము కలిగినది, 'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధము చేసిన వాడగును.


పండ్రెడు సంవత్సరముల లోపు వయసుగల బిడ్డను, తల్లి గాని, తండ్రిగాని, ఆ బిడ్డ రక్షణ బాధ్యత కలిగియున్న వ్యక్తి గాని అరక్షితముగ వదలివేయుట మరియు పరిత్యజించుట.

317. పండ్రెండు సంవత్సరముల లోపు వయస్సుగల బిడ్డ యొక్క తండ్రి లేక తల్లియై యుండి, లేక అట్టి, బిడ్డ రక్షణ బాధ్యతను కలిగి యుండి, అట్టి బిడ్డను పూర్తిగా పరిత్యజించు ఉద్దేశముతో ఏ స్థలమునందైన ను అట్టి బిడ్డను అరక్షితముగా వదలివేయు లేక విడిచి వెళ్లు వారెవరైనను, ఏడు సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

విశదీకరణము :- అరక్షితముగా వదలివేయుట వలన బిడ్డ మరణించినచో, హత్య చేసినందుకుగాని, సందర్భానుసారముగా, అపరాధిక మానవవధ చేసినందుకుగాను, అపరాధీని విఛారణకు గురిచేయపకుండా నివారించుట, ఈ పరిచ్ఛేదము యొక్క ఉద్దేశము కాదు.