పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మినహాయింపు 4:-అపరాధిక మానవవధ చేసిన అపరాధి అకస్మాత్తుగా తటస్థించిన కలహమువల్ల అకస్మాత్తుగా జరిగిన కొట్లాటలోని ఉద్రేకముతో మండిపడి పూర్వచింతన లేకుండా, ఆ అవకాశమును దుర్వినియోగ పరచకుండా లేక క్రూరముగ గాని. అసాధారణముగ గాని ప్రవర్తించకుండా అపరాధిక మానవవధ చేసినచో ఆ అపరాధిక మానవవధ హత్యకాదు.

విశదీకరణము :— అట్టి సందర్భములలో ఏ పక్ష మువారు ప్రకోపమును కలిగించినారు అనునది, లేక ప్రప్రథమముగా దౌర్జన్యము చేసినారు. అనునది ముఖ్యాంశము కాదు.

మినహాయింపు 5:—మరణము కలిగింపబడిన వ్యక్తి వయస్సులో పదునెనిమిది సంవత్సరములు దాటిన వాడై యుండి తన సమ్మతితోనే మరణమునకుగాని, మరణము కలుగగల ముప్పునకు గాని గురిచేయబడినపుడు అపరాధిక మానవవధ హత్యకాదు.

ఉదాహరణము

'ఏ' స్వచ్ఛందనముగా తన ప్రేరణ వలన పదునెనిమిది సంవత్సరముల లోపు వయస్సుగల వ్యక్తి యైన 'జడ్' ను ఆత్మహత్య చేసికొనునట్లు చేయును. ఇచట 'జడ్' లేబ్రాయపు వాడై నందున తన మరణమునకు సమ్మతినిచ్చుటకు అసమర్థుడై యుండును. కావున "ఏ" హత్యా దుష్ప్రేరణ చేసినవాడగును.

మరణము కలిగించుటకు ఉద్దేశింపబడిన వ్యక్తికి కాక ఇతర వ్యక్తికి మరణము కలిగించుటద్వారా అపరాధిక మానవ వధ

301. మరణము కలిగించుటకు తాను ఉద్దేశించియుండి, లేక మరణము కలుగగలదని ఎరిగియుండి, ఒక వ్యక్తి ఏపనినై నను చేయుట ద్వారా, మరణము కలిగింపవలెనని తాను ఉద్దేశించియుండనట్టి లేక మరణము కలుగగలదని తాను ఎరిగియుండనట్టి ఏ వ్యక్తి కై నను మరణమును కలిగించుట ద్వారా అపరాధిక మానవవధను చేసినచో, ఆ అపరాధిచే చేయబడిన అపరాధిక మానవవధ, అతడు ఏ వ్యక్తికి మరణము కలిగించుటకు ఉద్దేశించి యుండెనో లేక మరణము కలుగగలదని ఎరిగియుండెనో ఆ వ్యక్తి కి మరణము కలిగియుండినచో, అది ఎట్టి రకపుదై యుండెడిదో అట్టి రకపుదే అగును.

హత్య చేసినందుకు శిక్ష.

302. హత్యచేయు వారెవరైనను, మరణదండనతో గాని, యావజ్జీవ కారావాసముతోగాని శిక్షింపబడుదురు, మరియు జూర్మానాకు కూడా పాత్రులగుదురు.

యావజ్జీవ ఖైదీ హత్య చేసినందుకు శిక్ష,

303. యావజ్జీవ కారావాస దండనోత్త రువు ఈయబడియుండి, హత్యచేయువారెవరై నను మరణదండనతో శిక్షింపబడుదురు.

హత్య కానట్టి అపరాధిక మానవ వధ చేసినందుకు శిక్ష.

304. హత్య కానట్టి ఆపరాధిక మానవవధ చేయు వారెవరై నను మరణమును కలుగజేసినట్టి కార్యమును మరణము కలిగించవలెనను, లేక మరణము కలిగించగల శారీరక హానిని కలిగించవలెనను ఉద్దేశముతో చేసియుండినచో యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతోగాని శిక్షింప బడుదురు, మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు :

లేక, ఆకార్యముచేయుటవలని మరణము కలుగగలదని ఎరిగి యుండి, మరణము కలిగించవలెననియైనను, మరణము కలిగించగల శారీరక హాని కలిగించవలెననియైనను ఉద్దేశమేదియు లేకుండ, ఆ కార్యమును చేసియుండినచో, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

నిర్లక్ష్యముతో మరణము కలుగజేయుట.

304-ఏ. ఆపరాధిక మానవవధ కాకుండా, తొందరపాటుతో లేక నిర్లక్ష్యముతో కూడిన ఏదేని కార్యము చేయుటద్వారా, ఏ వ్యక్తి కైనను మరణము కలుగజేయు వారెవరైనను, రెండు సంవత్సముల దాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జూర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

బిడ్డను లేకఉన్మతు డైన వ్యక్తిని ఆత్మహత్య చేసికొనుటకు దుష్ప్రేరణ చేయుట.

305. పదునెనిమిది సంవత్సముల లోపు వయస్సుగల ఏ వ్యక్తి యైనను, ఉన్మత్తుడగు ఏ వ్యక్తి యైనను, మతి బ్రమణముగల ఏ వ్యక్తి యైనను, జడుడు ఎవరైనను, లేక త్రాగుడు మత్తులో ఉన్న ఏ వ్యక్తి యైనను, ఆత్మహత్య చేసికొనినయెడల, అట్టి ఆత్మహత్య చేసికొనుటకు దుష్ప్రేరణ చేయువా రెవరై నను మరణ దండనతో గాని, యావజ్జీవ కారావాసముతోగాని పది సంవత్సరములకు మించని కాలావధికి కారావాసముతో గాని శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు.

ఆత్మహత్య చేసికొనుటకు దుష్ప్రేరణ చేయుట.

306. ఏ వ్యక్తి యై నను ఆత్మహత్య చేసికొనినచో, అట్టి ఆత్మహత్య చేసికొనుటకు దుష్ప్రేరణ చేయు వారెవరైనను పది సంవత్సముల దాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు.