పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

41


కథనము పై సంతకము చేయుటకు నిరాకరించుట.

180. ఏదేని కథనము పై తత్ కర్తను సంతకము చేయుమని కోరుటకు శాసనరీత్యా సమర్ధుడైన పబ్లికు సేవకుడు ఆ కథనముపై అతనిని సంతకము చేయుమని కోరినపుడు, దానిపై సంతకము చేయుటకు నిరాకరించు నతడెవరైనను మూడుమాసములదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతో గాని, ఐదువందల రూపాయల దాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడును. పబ్లికు సేవకుని సమక్షమున, లేక ప్రమాణము నైనను ప్రతిజ్ఞనైనను చేయించుటకు ప్రాధికారముగల వ్యక్తి సమక్షమున ప్రమాణము లేక ప్రతిజ్ఞ చేసికూడ అబద్ధము చెప్పుట.

181. ఎవరేని పబ్లికు సేవకునికి గాని ప్రమాణమునైనను ప్రతిజ్ఞ, నైనను చేయించుటకు శాసనరీత్యా ప్రాధికారముగల ఎవరేని ఇతర వ్యక్తికిగాని, ఏదేని విషయమును గురించి నిజము చెప్పుటకై ప్రమాణము లేక ప్రతిజ్ఞ ద్వారా శాసనరీత్యా బద్దుడై యుండి, అట్టి పబ్లికు సేవకునికిగాని పైన చెప్పబడినట్టి ఇతర వ్యక్తికిగాని ఆ విషయమును గురించి ఆబద్దమైనట్టి దగు, మరియు ఆబద్ధమైనదని తనకు తెలిసియున్నట్టిదైనను, అట్టిదని తాను విశ్వసించునట్టి దైనను, లేక నిజమైనదని తాను విశ్వసించనట్టిదైనను అగు దేనినై నను చెప్పిన వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

పబ్లికు సేవకుని శాసన సమ్మత ఆధికారమును అతడు మరొక వ్యక్తి కి హాని కలిగించుటకు ఉపయోగించునట్లు చేయు ఉద్దేశముతో తప్పుడు సమాచారము అందజేయుట.

182. ఎవరేని పబ్లికు సేవకునిచే——

(ఏ) ఏ సంగతులను గురించి ఆతనికి సమాచారము ఈయబడినదో వాటి నిజస్థితి తెలిసియున్నచో అట్టి పబ్లికు సేవకుడు చేయకూడని దేనినైనను చేయునట్లు, లేక చేయుట మానకూడని దేనినైనను మానునట్లు, లేక

(బి) అట్టి పబ్లికు సేవకుని శాసనసమ్మత అధికారమును ఏ వ్యక్తి కైనను హానిని లేక చికాకును కలిగించుటకు ఉపయోగించునట్లు,

చేయించు ఉద్దేశముతో గాని, ఆట్లు చేయించుట సంభవమని ఎరిగియుండిగాని, అట్టి ఏదేని సమాచారమును అది తప్పుడుదని తాను ఎరిగియుండియు, లేక అట్టిదని తాను విశ్వసించియుండియు, అట్టి పబ్లికు సేవకునకు అంద జేయు వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని లేక ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఉదాహరణములు

(ఏ) 'ఏ ' తాను ఒక మేజిస్టేటుకు అందజేయుచున్న సమాచారము తప్పుడు దనియు, ఆ సమాచారము వలన ఆ మేజిస్టేటు తనకు ఆధీనస్టుడైన ' జడ్ ' అను పోలీసు అధికారిని బర్తరఫ్ చేయుట సంభవమనియు ఎరిగియుండి, ఆతని కర్తవ్యమును నిర్లక్ష్యము చేసినాడని లేక దుష్ప్రవర్తనగలవాడని, అట్టి మేజిస్టేటుకు సమాచారమునందజేయును. 'ఏ' ఈ పరిచ్చేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసినవాడగును.

(బి) 'ఏ ' తాను ఒక పబ్లికు సేవకునకు అందజేయుచున్న సమాచారము తప్పుడు దనియు, ఆ సమాచార పరిణామముగా, 'జడ్' కు చికాకు కలుగునట్లు అతని ఇల్లు సోదాచేయబడుననియు ఎరిగియుండి, దొంగచాటుగా తయారైన ఉప్పు 'జడ్' వద్ద ఒక రహస్య స్థలములో ఉన్నదని ఆ పబ్లికు సేవకునకు తప్పుడు సమాచారమును అందజేయును. 'ఏ ' ఈ పరిచ్చేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసినవాడగును.

(సీ) 'ఏ' తాను ఒకానొక గ్రామ సమీపములో దౌర్జన్యమునకును, దోపిడీకినీ గురి అయినానని ఒక పోలీసుకు తప్పుడు సమాచారమును అందజేయును. అతడు తనపై దౌర్జన్యము చేసినవారిలో ఒకడని ఏ వ్యక్తి పేరును చెప్పడు పనీ ఈ సమాచార పరిణామముగా గ్రామస్థులకు లేక వారిలో కొందరికి చికాకు కలుగునట్లు పోలీసు వార గ్రామములో దర్యాప్తులు, సోదాలు జరుపగలరని ఎరుగును. 'ఏ' ఈ పరిచ్ఛేదము క్రింది అపరాధమును చేసిన వాడగును.

పబ్లికు సేవకుని శాసనసమ్మత ప్రాధికారము ననుసరించి ఆస్తిని తీసుకొనుటకు ప్రతిఘటన.

183. పబ్లికు సేవకుడని ఎరిగియుండి, లేక ఆటని విశ్వసించుటకు కారణముండి, ఆతని శాసన సమ్మత ప్రాధికారమును బట్టి ఏదేవి ఆస్తిని తీసికొనుటను ప్రతిఘటింపజూచువారెవరైనను, ఆరు మాసముల దాక ఉండగల కాలావధికి రెంటితో ఒక రకపు కారావాసముతో గాని, వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని ఈ రెండింటితోగాని, శిక్షింపబడుదురు.