పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/43

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42


పబ్లికు సేవకుని ప్రాధికారమునుబట్టి విక్రయింప జూపబడిన ఆస్తి విక్రయమును ఆటంక పరచుట.

184. ఎవరేని పబ్లికు సేవకుడు తన పదవిని బట్టి శాసన సమ్మతముగా ఒసగబడిన ప్రాధికారము ననుసరించి విక్రయింపజూపిన ఆస్తి యొక్క విక్రయమును దేనినైనను ఉద్దేశ పూర్వకముగ ఆటంకపరచువారెవరైనను, ఒక మాసముదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఐదు వందల రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు,

పబ్లికు సేవకుని ప్రాధికారమునుబట్టి విక్రయింప జూపబడిన ఆస్తిని శాసన విరుద్ధముగ కొనుట లేక దానికై వేలము పాడుట.

185. ఎవరేని పబ్లికు సేవకుడు తన పదవిని బట్టి శాసవ సమ్మతముగా ఒసగబడిన ప్రాధికారముననుసరించి జరిపిన ఆస్తి విక్రయములో, ఆ విక్రయమునందు ఆ ఆస్తిని కొనుటకు శాసనరీత్యా ఆర్హత లేనట్టి వ్యక్తి యని ఎరిగియుండిన వ్యక్తి పక్షమున -- ఆ వ్యక్తి తానే యైనను, ఇతరుడైనను - అట్టి ఆస్తిని కొనుగోలు చేయు లేక దానికై వేలము పాడువారెవరైనను, లేక వేలము పాడుటవలన ప్రాప్తించెడు బాధ్యతలను నిర్వహించు ఉద్దేశ్యము లేకయే అట్టి ఆస్తికై వేలముపాడువారెవరైనను, ఒక మాసముదాక ఉండగల కాలావధికి రెండింటిలో ఒకరకపు కారావాసముతోగాని రెండువందల రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

పబ్లికు కృత్యములను నిర్వహించుటలో పబ్లికు సేవకుని ఆటంకపరచుట.

186. ఏ పబ్లికు సేవకుని కైనను, ఆతని పబ్లికు కృత్యముల నిర్వహణములో స్వచ్ఛందముగా ఆటంకము కలిగించు వారెవరైనను మూడు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఐదు వందల రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

పబ్లికు సేవకునికి సహాయ పడుటకు శాసనరీత్యా బద్దుడై యుండియు సహాయ పడకుండుట.

187. ఏ పబ్లికు సేవకునికైనను, అతని పబ్లికు కర్తవ్య నిర్వహణములో సహాయపడుటకు, లేక సహాయము నందజేయుటకు శాసనరీత్యా బద్దుడై యుండి, ఉద్దేశపూర్వకముగా అట్టి సహాయమును చేయకుండు వారెవరై నను ఒక మాసముదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని రెండు వందల రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

మరియు, న్యాయస్థానముచే శాసనసమ్మతముగా జారీచేయబడిన ఏదేని ఆదేశికను అమలు పరచుటకుగాని, అపరాధము జరుగకుండ నివారించుటకుగాని, దొమ్మీని లేక జగడమును అణచుటకుగాని, ఆపరాధము ఆరోపింపబడిన లేక, అపరాధము చేసిన లేక శాసన సమ్మత అభిరక్ష నుండి తప్పించుకొని పోయిన వ్యక్తిని పట్టుకొనుటకు గాని, అట్టి సహాయమును అభ్యర్థించుటకై శాసనరీత్యా సమర్ధుడైన పబ్లికు సేవకునిచే ఆట్టి సహాయమును చేయవలసినదిగా అభ్యర్థింపబడియున్నచో, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని అయిదు వందల రూపాయలదాక ఉండగల జుర్మానా తోగాని ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

పబ్లికు సేవకునిచే తగురీతిగా ప్రఖ్యాపన చేయబడిన ఉత్తరువును పాటించకుండుట.

188. ఒక ఉత్తరువును ప్రఖ్యాపన చేయుటకు శాసనసమ్మతముగా అధికారము గల పబ్లికు సేవకునిచే ప్రఖ్యాపన చేయబడిన అట్టి ఉత్తరువునుబట్టి తానొక కార్యమును చేయరాదనిగాని, తన స్వాధీనములోనైనను తన నిర్వహణము క్రిందనైనను ఉన్న ఏదేని ఆస్తిని గురించి ఏదేని ఒక ఏర్పాటు చేయవలెననిగాని ఆదేశించబడిన వాడనని ఎరిగియుండియు, అట్టి ఆదేశమును పాటించని వారెవరైనను,

అట్టి పాటింపమి, శాసనసమ్మతముగా వ్యవహరించుచున్న ఏ వ్యక్తులకైనను, ఆటంకముసు, చికాకును లేక, హానినిగాని, ఆటంకము, చికాకు లేక హాని కలిగెడు ముప్పునుగాని కలిగించుచో, లేక అట్లు కలిగించు వైఖరి గలదైనచో ఒక మాసముదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని లేక రెండు వందల రూపాయలదాక ఉండగల జుర్మానా తోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు;

మరియు అట్టి పాటింపమి మానవ ప్రాణమునకు, ఆరోగ్యమునకు లేక భద్రతకు అపాయమును కలిగించునదిగాని కలిగించు వైఖరి గలదిగాని అయినచో, లేక దొమ్మీనైనను, జగడమునైనను కలిగించునదిగాని కలిగించు వైఖరిగలది గాని అయినచో, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

విశదీకరణము : ఆపరాధి కీడు కలుగజేయవలెనని ఉద్దేశించుటగాని అట్టి పాటించమి కీడు కలిగించగలదని తలచుటగాని ఆవశ్యకము కాదు. తాను పాటించని ఉత్తరువును గురించియు, తన పాటింపమి వలన కీడు కలుగునని లేక కలుగగలదని అతను ఎరిగియున్న చాలును.

ఉదాహరణము

మత సంబంధమైన ఒక ఊరేగింపు ఒకానొక వీధి వెంట పోరాదని ఆదేశించు ఉత్తరువును ప్రఖ్యాపన చేయుటకు శాసనసమ్మత అధికారము గల పబ్లికు సేవకునిచే అట్టి ఉత్తరువు ప్రఖ్యావన చేయబడినది. ఆ ఉత్తరువును గురించి ఎరిగి యుండియు 'ఏ' ఆ ఉత్తరువును పాటించకుండా తద్వారా దొమ్మీ జరుగు ఆపాయమును కలుగజేయును. 'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన ఆపరాధమును చేసినవాడగును.